మూగజీవాలకు ఆపద్బాంధవుడు
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరంలో నిత్యం వందలాది ఆవులు రోడ్లపై యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో కొన్ని సార్లు ప్రమాదాలకు గురై రోడ్డుపైనే పడి ఉంటాయి. ఆ సమయంలో వీటిని సంరక్షించే వారు ఎవరా అని స్థానికులు ఆలోచిస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి ఠక్కున గుర్తుకు వచ్చేది సామాజిక కార్యకర్త మల్లిపూడిరాజు పేరు. వెంటనే ఆయనకు సమాచారం అందించడంతోనే ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బందికి సమాచారం అందించడం వారు చెప్పిన విధంగా మూగ జీవాలకు ముందుగా ప్రథమ చికిత్స వంటివి అందించడం, అనంతరం వాటిని ఏదైనా వాహనంలో పశువైద్యశాలకు తీసుకువెళ్లడం వంటివి చకచకా చేయడం మల్లిపూడి రాజుకు పరిపాటిగా మారింది. గత పదేళ్లల్లో ఆయన దాదాపు 200కు పైగా ఆవులకు తన సాయశక్తులా సేవలు అందించి వాటిని కాపాడారు. ఏలూరు నగరంలో మల్లిపూడిరాజు చేస్తున్న ఈ కార్యక్రమాలనునగర వాసులు అభినందిస్తున్నారు.
చిరు వ్యాపారమే అయినా
చేసేది చిరు వ్యాపారమే దానిలో వచ్చే లాభంతోనే మూగ జీవాలకు సేవ
మల్లిపూడి రాజు స్థానిక పాతబస్టాండ్ సెంటర్‌లో ఒక సాదారణ ఫ్యాన్సీ షాపు నిర్వహిస్తూ ఉంటారు. దీంతో ఆయన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ షాపులోనే ఉంటాడు. దీంతో రోడ్డుపైన జరిగే పలు సంఘటనలు ఆయన దృష్టికి వస్తాయి. ఈ క్రమంలోనే కొన్ని సందర్భాల్లో ప్రమాదాల్లో గాయపడిన ఆవులు గురించి, రోడ్లపై చెత్త,ప్లాస్టిక్ వంటివి తినేసి ఎటూ కదలలేని ఆవుల గురించి రాజుకు సమాచారం వస్తుంది. వెంటనే ఆయన తన షాపును పని చేసే కుర్రాళ్లకు అప్పగించి సంఘటన స్థలానికి వెళ్లి మూగ జీవాల సేవ చేస్తారు. ప్రమాదంలో గాయపడి కోలుకున్న ఆవులు, ఇతర జీవాలను వాటి యజమానులకు అప్పగించేంత వరకు ఆయనే వాటిని సంరక్షిస్తూ ఉంటారు. దీనికోసం తన సంపాదనలో వచ్చే కొద్దిపాటి లాభాలనే వినియోగిస్తూ ఉంటారు.
పదేళ్లలో సేవలు ఇలా
గత పదేళ్లల్లో మల్లిపూడి రాజు దాదాపు 200కు పైగా మూగ జీవాలను రక్షించారు. అవి కోలుకున్న తరువాత వాటి యజమానులకు అప్పగించారు. ఎవరూ రాని వాటిని గోశాలలకు అప్పగిస్తూ ఉంటారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యునిగా, సామాజిక కార్యకర్తగా ఉన్న మల్లిపూడిరాజు సేవలకు గుర్తింపుగా గతేడాది ఆగస్టు 15న సామాజిక కార్యకర్తల విభాగంలో ప్రశంసా పత్రాన్ని మంత్రి కొలుసు పార్థసారధి, కలెక్టర్ వెట్రిసెల్వి, జిల్లా జడ్జి సి.పురుషోత్తంకుమార్, ఎస్పీ కేఎస్ ప్రతాప్ కిషోర్‌ల సమక్షంలో అందుకున్నారు. గతంలోనూ పలు సంస్థలు ఆయన సేవలకు గుర్తింపుగా అవార్డులు, ప్రశంసా పత్రాలను అందించాయి.
మూగజీవాల సంరక్షణ కోసం ఏలూరు వాసి కృషి
పదేళ్లలో 200 పశువులను కాపాడిన వైనం
పదేళ్లుగా మూగజీవాలకు సేవ
మూగ జీవాలపై ఉన్న ప్రేమతో నేను గత పదేళ్లుగా మూగ జీవాలకు సేవ చేస్తున్నాను. కొందరు తమ సంపాదనలో కొంత మొత్తాన్ని అన్నదానానికి, దైవ కార్యక్రమానికి,సేవా కార్యక్రమాలకు వినియోగిస్తుంటారు. దానికి భిన్నంగా నేను నా సంపాదనలో వచ్చే కొద్ది లాభాన్ని మూగ జీవాల సంరక్షణ, చికిత్స కోసం వినియోగిస్తుంటాను.
– మల్లిపూడి రాజు, సామాజిక కార్యకర్త, ఏలూరు
Comments
Please login to add a commentAdd a comment