కొబ్బరికి రూ.15 వేలు మద్దతు ధర ప్రకటించాలి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి ప్రకటించిన కనీస మద్దతు ధర కొబ్బరి రైతుకు ఏమాత్రం సరిపోదని, క్వింటాల్ కొబ్బరికి రూ. 15వేలు కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరు అన్నే భవనంలో సంక్షోభంలో కొబ్బరి సాగు–కొబ్బరి రైతుకు కనీస మద్దతు ధర అంశంపై మంగళవారం నిర్వహించిన కొబ్బరి రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024లో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్ కు కనీస మద్దతు ధర రూ.11,160 ఉండగా 2025కు రూ.422లు పెంచి రూ.11,582 గాను, 2024లో బంతి కొబ్బరి క్వింటాల్ కు రూ. 12 వేలు ఉంటే 2025కు రూ.100 లు పెంచి రూ.12,100గా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరలు ప్రకటించిందని చెప్పారు. కొబ్బరి సాగుకు పెరిగిన ఖర్చుల రీత్యా, తెగుళ్లు ఇతర కారణాల వలన తగ్గిన దిగుబడి రీత్యా ఈ మద్దతు ధర రైతుకు ఏ మాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కొబ్బరి దిగుబడులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ప్రైవేటు మార్కెట్ లో ఒక్కో కొబ్బరికాయకు రూ.13 నుంచి రూ.16 లు ధర వస్తున్నా ఈ ధర నిలకడ కాదని చెప్పారు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ కొనుగోలు సంస్థలు సక్రమంగా పనిచేయడం లేదని, కొబ్బరి ధర పడిపోయిన సందర్భాల్లో రైతుల నుంచి కొబ్బరిను సేకరించే చర్యలు చేపట్టడం లేదన్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు ద్వారా కొబ్బరి రైతులకు ప్రోత్సాహాలు అందించాలన్నారు. కొబ్బరికి బీమా పథకం అమలు చేస్తున్నామని చెబుతున్నా రైతులకు ఏమాత్రం బీమా లేదని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు రామకష్ణ, గుదిబండి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment