చింతలపూడి: నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి ఒక మహిళ మృతికి కారణమైన ఇద్దరు వ్యక్తులకు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్ మధుబాబు ఏడాది జైలు శిక్ష , 5,000 రూపాయల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పును వెల్లడించారు. వివరాల ప్రకారం 2018లో చింతలపూడి గ్రామానికి చెందిన పింగుల వెంకటేశ్వరరావు అశోక్ లేలాండ్ వ్యానులో వెళ్తుండగా పెదవేగి మండలం , రామశింగవరం గ్రామానికి చెందిన సూరిశెట్టి సుబ్బారావు ట్రాక్టర్ తోలుకుని వస్తుండగా రెండు వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొట్టుకోవడంతో వ్యానులో ఉన్న బోయ నాగమణి(25) మృతి చెందగా పది మంది మహిళలకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి చింతలపూడి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో ఐపీసీ సెక్షన్ 304(ఎ) కింద ముద్దాయిలు ఇద్దరికి ఏడాది జైలు శిక్ష , 5,000 రూపాయల జరిమానా, ఐపీసీ సెక్షన్ 338 క్రింద మరో ఏడాది జైలు శిక్ష , వెయ్యి రూపాయలు జరిమానా విధించారు. కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ హేమలత వాదించారు. సాక్షులను ప్రవేశపెట్టి కేసు పరిష్కరించడంలో సహకరించిన సీఐ రవీంద్ర నాయక్, ఎస్సై కుటుంబరావు, కోర్టు కానిస్టేబుల్ ఎన్‌కే భగవాన్‌లను జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment