– సంయుక్త
పాలక్కాడ్ టు హైదరాబాద్... చెన్నై... ముంబై... సినిమా అనేది సంయుక్తను అన్ని రాష్ట్రాల్లోనూ పాపులర్ చేసింది. రీల్‌పై హీరోయిన్... రియల్‌గానూ అంతే... ఆపన్న హస్తం అందించడానికి వెనకాడరామె. 2018లో కేరళలో వరదలు సంభవించినప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు సంయుక్త. తాజాగా వయనాడ్ బాధితులకు విరాళం ఇచ్చారు. ‘ఆది శక్తి’ పేరుతో సేవా సంస్థను ఆరంభించారు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్న ఈ మలయాళ బ్యూటీ ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ...
→ కేరళలో పుట్టి పెరిగిన మీకు ఇప్పుడు వయనాడ్‌ని చూస్తుంటే బాధ అనిపించడం సహజం. వయనాడ్ ఎన్నిసార్లు వెళ్లారు?
సంయుక్త: ఇప్పటివరకూ నేను ఒకే ఒక్కసారి వెళ్లాను. చాలా అందమైన ప్రదేశం. మంచి హిల్ స్టేషన్. హాయిగా గడపడానికి అక్కడికి వెళుతుంటారు. అలాంటి వయనాడ్ రూపు రేఖలు వర్షాల వల్ల మారి΄ోవడంతో బాధ అనిపించింది. ఇప్పుడు వయనాడ్ వెళదామనుకున్నాను కానీ సందర్శనలకు అనుమతి లేదు.
→ వయనాడ్‌లో షూటింగ్స్ ఏమైనా చేశారా?
ఆ అవకాశం ఇప్పటివరకూ రాలేదు. యాక్చువల్లీ అక్కడ వర్షాలప్పుడు నేను హైదరాబాద్‌లో ఉన్నాను. ప్రతి గంటకూ మా అమ్మగారు ఫోన్ చేసి, పరిస్థితులు చెప్పేవారు. ఆ బీభత్సం చూసి, ఆవిడైతే నాలుగైదు రోజులు నిద్ర΄ోలేదు. నిజానికి వయనాడ్‌కి ఏమైనా చేయమని అమ్మే చెప్పింది. నేనూ అదే అనుకున్నాను కాబట్టి వెంటనే విరాళం ఇచ్చాను.
→ ఆర్థిక సహాయమేనా? 2018 కేరళ వరదలప్పుడు స్వయంగా సహాయ కార్యక్రమాలు చేసినట్లు చేయాలనుకుంటున్నారా?
ఇంకా చేయాలని ఉంది. కేరళలోని ఓ స్వచ్ఛంద సేవా సంస్థతో మాట్లాడాను. ఏం చేస్తే బాగుంటుందో వాళ్లు గ్రౌండ్ లెవల్‌లో స్టడీ చేస్తున్నారు. దాన్నిబట్టి సహాయ కార్యక్రమాలను ΄్లాన్ చేస్తాను.
→ 2018లో చేసిన సేవా కార్యక్రమాల గురించి...
2018లో కేరళ వరదలప్పుడు నేను చెన్నైలో ఇరుక్కు΄ోయాను. బాధితుల కోసం చాలా చిన్న స్థాయిలో ఓ కలెక్షన్ సెంటర్ ఏర్పాటు చేశాను. నేను ఊహించినదానికన్నా ఎక్కువ నిత్యావసర వస్తువులు రావడంతో పెద్ద గోడౌన్ తీసుకోవాల్సి వచ్చింది. వచ్చినవి వచ్చినట్లు సరఫరా చేశాం. ఇక కేరళ వెళ్లాక పాడై΄ోయిన ఇళ్లను బాగు చేసే కార్యక్రమంలో పాల్గొన్నాను. చెప్పలేనంత మట్టి పేరుకు΄ోవడంతో క్లీన్ చేయడానికి ఇబ్బందిపడ్డాం.
→ సంయుక్తా మీనన్‌లోంచి ‘మీనన్’ ఎందుకు తీసేశారు?
మా అమ్మానాన్న విడి΄ోయారు. అమ్మంటే నాకు చాలా ప్రేమ, గౌరవం. తన ఫీలింగ్స్‌ని గౌరవించి పేరులోంచి సర్ నేమ్ తీసేశాను. ఇంకో విషయం ఏంటంటే... నేను ఆడ.. మగ సమానం అని నమ్ముతాను. సర్ నేమ్ వద్దనుకోవడానికి అదో కారణం.
→ సింగిల్ పేరెంట్‌గా మీ అమ్మగారు మిమ్మల్ని పెంచారు కాబట్టి తండ్రి ప్రేమను మిస్సయిన ఫీలింగ్...
యాక్చువల్లీ నాకు అమ్మానాన్న ఇద్దరి ప్రేమనీ పంచారు మా తాతగారు (సంయుక్త అమ్మ తండ్రి). నేను ఏం అడిగినా కాదని చెప్పలేనంత ప్రేమ మా తాతగారిది. అలాగని గుడ్డిగా ఓకే చెప్పలేదు. ఆయన బాధపడే పనులు చేయనని, అసలు తప్పు చేయనని నమ్మకం. అంత ప్రేమ పంచి, నమ్మకాన్ని పెంచుకున్న మా తాత నా ఫస్ట్ బాక్సాఫీస్ సక్సెస్‌ని చూడకుండానే తిరిగి రాని లోకాలకు వెళ్లి΄ోయారు. కానీ, ఎక్కడున్నా తన మనవరాలి విజయాన్ని చూస్తున్నారన్నది నా నమ్మకం.
→ ‘స్వయంభూ’, హిందీ ‘మహారాజ్ఞి’ కోసం ఫైట్స్ కూడా నేర్చుకున్నారు... ఇప్పటివరకూ దాదాపు సున్నితమైన పాత్రల్లో కనిపించిన మీరు ఇప్పుడు పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారన్న మాట...
‘స్వయంభూ’ కోసం గుర్రపు స్వారీ, ఫైట్స్‌లో శిక్షణ తీసుకున్నాను. అటు హిందీ ‘మహారాజ్ఞి’ కోసం కూడా యాక్షన్ నేర్చుకున్నాను. ఒకప్పుడు సినిమాలకు దూరంగా పారి΄ోవాలనుకున్న నేను ఇప్పుడు సినిమా కోసం ఏం నేర్చుకోవడానికైనా రెడీ అయి΄ోయాను. చేసే ప్రతి పాత్ర ఒకదానికి ఒకటి భిన్నంగా ఉండాలనుకుంటున్నాను. స్క్రీన్ మీద చూసి నాపై ప్రేమ పెంచుకున్న ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఎంతైనా కష్టపడొచ్చు.
→ ప్రేక్షకుల మీద ప్రేమతోనేనా ఈ సేవా కార్యక్రమాలు...
అవును. పాలక్కాడ్‌లో మొదలై ఇతర రాష్ట్రాల్లో ఆదరణ పొందడం అంటే చిన్న విషయం కాదు. నటిగా నేను సక్సెస్ అయ్యానంటే అది నా విజయం కాదు. నన్ను ప్రేక్షకులే సక్సెస్ చేశారు. హీరోయిన్‌గా నేను పొందిన ప్రేమను హ్యూమన్‌గా తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఏదైనా అర్థవంతంగా, ఉపయోగపడేది చేయాలన్నది నా సంకల్పం. అందుకే ‘ఆది శక్తి’ సేవా సంస్థ ఆరంభించాను.
→ కేరళ నుంచి నిత్యామీనన్, నయనతార, సమంత (సమంత అమ్మ మలయాళీ) వంటివారిని హైదరాబాద్ తీసుకొచ్చి స్టార్స్‌ని చేసింది టాలీవుడ్. ఇప్పుడు మీరు... మాలీవుడ్ అమ్మాయిలకు టాలీవుడ్ లక్కీ అనొచ్చా?
ఒక్క మాలీవుడ్ ఏంటి? ఎవరికైనా ఆహ్వానం పలుకుతుంది టాలీవుడ్. సో.. మాకే కాదు అందరికీ లక్కీయే. ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడటం మొదలుపెట్టారంటే ఇక ఆ స్టార్‌ని ఎప్పటికీ ఇష్టపడతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ సినిమాని సెలబ్రేట్ చేస్తుంది. ఇంతగా ప్రేమించే తెలుగు పరిశ్రమలో భాగం కావడం హ్యాపీగా ఉంది. అందుకే కేరళ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను.
→ మీ ‘ఆది శక్తి’ ఫౌండేషన్ గురించి క్లుప్తంగా...
ఎవరికైనా సహాయం చేయాలంటే జస్ట్ డబ్బులు ఇచ్చేస్తే సరి΄ోదు. వాళ్లు జీవించినంత కాలం పనికొచ్చే సహాయం చేయాలి. నేను స్త్రీ సంక్షేమంపై దృష్టి పెట్టాను. చదువు, ఆరోగ్యం, ఉద్యోగం... వీటికి సంబంధించి సహాయం చేయాలన్నది నా ఆశయం. ముఖ్యంగా నేటి స్త్రీల మానసిక ఆరోగ్యం చాలా దెబ్బ తింటోంది. ఆ విషయం మీద వారిని ఎడ్యుకేట్ చేయాలి. నేను ‘ఆది శక్తి’ ఆరంభించే ముందు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో మాట్లాడాను. కొంత రిసెర్చ్ చేసి, అవగాహన తెచ్చుకుని ‘ఆది శక్తి’ ఆరంభించాను.
– డి.జి. భవాని
Comments
Please login to add a commentAdd a comment