ఇటీవల మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా వార్తలు చదివే యాంకర్లను చూసి ఆశ్చర్యపోయాం. ఇది టెక్నాలజీపరంగా మనం చూస్తున్న మార్పులు. అంతవరకు బాగానే ఉంది కానీ, సోషల్ మీడియాలో మన ఫొటోలు, వీడియోలు దొంగిలించి, ఏఐ టెక్నాలజీ ద్వారా తక్కువ నిడివిగల మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలుగా రూపొందించి, వాటిద్వారా మనల్ని బెదిరించే, సన్నిహితులను డబ్బు అభ్యర్థించే నేరస్థులు పుట్టుకొస్తున్నారు జాగ్రత్త!లేనిది ఉన్నట్టుగా సృష్టించి, భ్రమించేలా చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డీప్ ఫేక్ స్కామ్స్ కొత్తగా వెలుగు చూస్తున్నాయి. స్కామర్లు ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు.
దీనివల్ల జరిగే హాని..
- ఒక వ్యక్తిని వేధించడం లేదా అవమానించడం. సమాజంలో వారి ఇమేజ్‌ను, అలాగే విశ్వసనీయతను నాశనం చేయడం.
- ఈ విధానం ద్వారా డబ్బులను డిమాండ్ చేయడం లేదా వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయడం, బెదిరించడం.
- కస్టమర్ కేవైసీ మెకానిజమ్‌ను కూడా మోసం చేయడం.
- క్రిమినల్ న్యాయ పరిశోధనల కోసం ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను మార్చడం.
- తప్పుడు సమాచార ప్రచారాలకు మద్దతు ఇవ్వడం.
- వినియోగదారుల పాస్‌వర్డ్‌లను తెలుసుకోవడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగించడం.
బాధితులను మోసగించడానికి స్కామర్లు ఉపయోగించే సాకులు
ఉదాహరణకు: మనకు లైవ్ వీడియో కాల్ వస్తుంది. ఆ వీడియోలో మనకు బాగా తెలిసిన సన్నిహిత వ్యక్తే ఉంటారు. ‘మా ఇంట్లో దొంగతనం జరిగింది. నా దగ్గర అవసరానికి డబ్బేమీ లేదు. సహాయం చెయ్ ప్లీజ్’ అని అడుగుతారు. లేదంటే.. సడెన్‌గా జబ్బు పడ్డాను, అత్యవసర పరిస్థితుల కోసం నాకు డబ్బు కావాలి యాక్సిడెంట్ అయ్యింది, డబ్బు కావాలి’ అని అంటారు. ఆ సమయంలో ‘అయ్యో, మనకు తెలిసిన వారికే, ఎంతటి కష్టం వచ్చింది అనుకుంటాం. డబ్బు సాయానికి ఆన్‌లైన్ బదిలీలు చేస్తాం. ఆ తర్వాత కానీ, జరిగిన నష్టం అర్థం కాదు.
దుర్వినియోగం ఇలా అవుతోంది..
► డీప్ ఫేక్‌లను (వీడియోలు, ఫేక్‌వర్చువల్ ఐడెంటిటీలు) రూపొందించడంలో ఏఐ సహాయపడుతుంది. ఇది చాలా వాస్తవికంగా కనిపిస్తుంది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికీ, అసలు వ్యక్తుల్లా నటించడానికీ ఉపయోగపడుతుంది.
► మోడర్న్ స్టైల్‌లో వాయిస్ ఫిషింగ్ దాడులను నిర్వహించడానికి సైబర్ నేరస్తులు సోషల్ మీడియా అకౌంట్లనుంచి మన ఆడియోలను క్లోన్ చేయవచ్చు. (ఎమర్జెన్సీ సాకుతో డబ్బును బదిలీ చేయడానికి బాధితుల్లా నటించవచ్చు)
► ఏఐ టెక్నిక్స్ ఉపయోగించి సైబర్ నేరస్తులు మీ ఇమెయిల్‌ను పోలినటువంటి మెయిల్స్‌నే క్రియేట్ చేయవచ్చు.
► ఇప్పటికే ఉన్న ఆన్‌లైన్ సేఫ్టీని తప్పించి హైటెక్ మాల్వేర్‌ను రూపొందించడానికి ఏఐ ఉపయోగపడుతుంది.
► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే డిజిటల్ ల్యాండ్ స్కేప్‌లు మనుషుల ప్రవర్తనకు తగినట్టుగా అనుకరిస్తాయి. అందుకే, ఏఐ సాధనాలను ఉపయోగించి మరింత నమ్మదగిన సోషల్ దాడులకు పాల్పడవచ్చు.
నేరాల బారిన పడకుండా చిట్కాలు
♦ కోడ్ వర్డ్ తప్పనిసరి చేయాలి. మీ పిల్లలు, కుటుంబసభ్యులు, సన్నిహితులకు సంబంధించి ఒక కోడ్‌వర్డ్‌ను సెట్ చేయండి. ఏదైనా వీడియో, లైవ్ ద్వారా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చర్చ వచ్చినప్పుడు కోడ్‌వర్డ్ చెప్పమని అడిగి, నిర్ధారించుకోవచ్చు.
♦ లైవ్‌లో అయితే ‘ఒకసారి వెనక్కి తిరగమని చెప్పండి. ఏఐ టెక్నాలజీ అయితే అలా తిరగడం అనేది సాధ్యం కాదు.
♦ సైబర్ నేరస్థులు మీ సన్నిహితుల ఫోన్ నంబర్ల మాదిరే కనిపించే యాక్సెస్‌ను కూడా కలిగి ఉంటారు. అందుకని, మీకు తెలిసిన నంబర్ నుండి వాయిస్ మెయిల్ లేదా టెక్ట్స్ వచ్చినా వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని, లోతైన కారణాన్ని కనుక్కోండి.
♦ మీ సోషల్ మీడియా, ఇ–మెయిల్ అకౌంట్స్‌కు రెండు రకాల ప్రామాణీకరణను పాటించండి. దీని వల్ల మీరు అనధికార విషయాలకు దూరంగా ఉండవచ్చు.
♦ అంకెలు, ప్రత్యేక అక్షరాలతో బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించండి.
♦ ఇ–మెయిల్స్, ఎస్సెమ్మెస్‌లలో వచ్చే షార్ట్ లింక్స్‌పై క్లిక్ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. ధ్రువీకరించినవాటిని మాత్రమే ఓపెన్ చేయండి.
ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్న ఏఐ మోసాల నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే ‘ఏది నిజం – ఏది మాయ’ అని తెలుసుకోవడం ముఖ్యం. ఆధునిక పద్ధతుల్లో జరిగే ఏ మోసాలైనా మానవ మేధస్సును ఉపయోగించి అడ్డుకోవడం సులువే. అందుకు కావల్సింది కొంత జాగరూకత మాత్రమే అని గుర్తించాలి.
డీప్ ఫేక్ స్కామ్ నమూనా..
►ఏఐ ఆధారిత ఫోన్ వీడియో కాల్ మోసాలు అవతలివారిని ఒప్పించేవిగా, నమ్మించేవిగా ఉండవచ్చు.
►నేరగాళ్లు బాధితులను యాదృచ్ఛికంగా ఎంచుకుంటారు. మన సోషల్ మీడియా ప్రొఫైల్ ఇందుకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత స్కామర్లు బాధితులతో సోషల్ నెట్‌వర్క్‌లతో కమ్యూనికేట్ చేయడం ప్రారంభిస్తారు.
► స్కామర్ మనకు తెలిసిన వ్యక్తిలా నటిస్తాడు. తప్పుడు కథనాలను పునరావృతం చేయడం ద్వారా (ఏఐ–ఆధారిత డీప్ ఫేక్‌లను ఉపయోగించడం) బాధితులను పెద్ద మొత్తంలో డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసేలా ఒప్పించడం, లేదా తియ్యగా మాట్లాడుతూ ఆర్థిక సహాయాన్ని అభ్యర్థించడం వంటి మోసాలకు పాల్పడతారు.
ఇన్‌పుట్స్: అనీల్ రాచమల్ల
డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్,
ఎండ్ నౌ ఫౌండేషన్
Comments
Please login to add a commentAdd a comment