ఓ సాధారణ రైతు పాఠశాల నిర్మించడానికి తన ఆస్తిలో కొంత భాగాన్ని దానంగా ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లోని భాగల్‌పూర్ జిల్లా బీహ్‌పూర్ బ్లాక్‌లో కహర్‌పూర్ గ్రామానికి చెందిన సుబోధ్ యాదవ్ అనే రైతు స్కూల్ నిర్మించేందుకు తన భూమిని దానంగా ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపారు. 2020లో కోసి నది నీటి మట్టం పెరగడంతో పాఠశాల మునిగిపోయింది. దీంతో విద్యార్థులు వేరే ప్రాంతానికి వెళ్లి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఆ గ్రామంలో ఉన్న ఏకైక పాఠశాల అదే. దీంతో బిహార్ ప్రభుత్వం పాఠశాల పూర్తిగా దెబ్బతినడంతో కొత్త పాఠశాల నిర్మించడం కోసం స్థలం వెతకడం ప్రారంభించింది. ఈ విషయం తెలుసుకున్న యాదవ్ తల్లి చడికా దేవి తన కూమారుడిని ఆస్తిలో కొంత ప్రభుత్వానికి దానంగా ఇవ్వమని కోరింది. దీంతో పక్కా పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి తన 15 సెంట్ల భూమిని ఆ పాఠశాల నిర్మాణం కోసం దానంగా ఇచ్చాడు.
ఆ భూమి విలువ సుమారు రూ. 8 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఈ మేరకు భాగల్‌పూర్ డీఈవో మాట్లాడుతూ..పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తి పేరు పెట్టాలని అనుకున్నామని, కానీ అతడు తన తల్లి పేరు పెట్టాలని అభ్యర్థించినట్లు తెలిపారు. సదరు రైతు యాదవ్ కూడా ఈ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు ఈ పాఠశాల కోసం భూమిని దానంగా ఇచ్చిన వ్యక్తిగా తన తల్లి సదా గుర్తించుకుంటారని ఆనందంగా చెబుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment