‘ఐదువేళ్లు ఒక్కటైతే ఐకమత్యం, బలం’ అని చిన్నప్పటి పాఠాల్లో చదువుకున్నాం. బతుకు పాఠాల్లో అది ముఖ్యమైన పాఠం. పదకొండు మంది మహిళలు ఒకేమాట మీద నిలబడి ఐక్యత సాధించడమే కాదు... జీవితం హాయిగా సాగిపోవడానికి అవసరమైన బాటను నిర్మించుకున్నారు...
దేశరాజధాని దిల్లీలో నిజాముద్దీన్ బస్తీ అని ఉంది. ఈ బస్తీని బస్తీ అనడం కంటే ‘రుచుల ఖజానా’ అనడం సబబు. ఏడువందల ఏళ్ల నాటి పాకశాస్త్ర ప్రావీణ్య పాఠాలకు ఈ గల్లీ ప్రసిద్ధి పొందింది. ఖమిరీ రోటీ నుంచి కబాబుల వరకు నోరూరించే బస్తీ ఇది.
దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్లు ఇక్కడ నివసించడం వల్ల భిన్నమైన వంటల రుచుల సమ్మేళనానికి వేదికగా మారింది. దిల్లీలోని భోజనప్రియులు ఒక్కసారైనా సరే ఈ గల్లీకి రావాల్సిందే. ‘జైకా’ రాకతో గల్లీకి కొత్త రుచుల కళ వచ్చింది.
దిల్లీలో చిన్నాచితకా పనులు చేసుకునే పదకొండుమంది మహిళలు ఒక గ్రూప్‌గా ఏర్పడి ‘జైకా–ఏ–నిజాముద్దీన్’ పేరుతో వంటల వ్యాపారంలోకి దిగారు. ‘ఆరోగ్యాన్ని పాడు చేసే చిరుతిండ్లకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలతో కూడిన తిండి’ అనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
లడ్డుతో వ్యాపారం మొదలుపెట్టారు. తియ్యటి విజయం సొంతం అయింది. ‘లడ్డూ కావాలా నాయనా’ అని ఒకరినొకరు ఊరించుకోవడం మొదలైంది. లడ్డు విజయం ఇచ్చిన ఉత్సాహం లో నిహరి, షమి కబాబ్, ఖీమా ఖరేలా, షిల్లమ్ గోష్... మొదలైన 50 ఐటమ్స్ తయారీలోకి దిగారు. అవి హాటెస్ట్ సెల్లింగ్ ఐటమ్స్‌గా మారడానికి ఎంతో కాలం పట్టలేదు.
ఈ ఉత్సాహంతో క్యాటరింగ్ వింగ్ మొదలు పెట్టారు. హోమ్ డెలివరీ, లైవ్‌కౌంటర్, కార్పోరేట్ ఆఫీసుల ఆర్డర్లతో వ్యాపారం నాన్–స్టాప్ స్పీడ్ అందుకుంది.‘జైకా’లో పనిచేసే పదకొండుమంది మహిళలు స్టార్‌హోటళ్లలో చెఫ్‌ల మాదిరిగానే యూనిఫాం ధరిస్తారు.
తమ వ్యాపారం ద్వారా వచ్చిన లాభాలలో ఫండ్ ఏర్పాటు చేసుకున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం సభ్యులు ఇందులో నుంచి వడ్డీ లేని రుణాలు తీసుకోవచ్చు. విశేషం ఏమిటంటే, దేశంలోని కార్పోరేట్ హోటళ్లలో ‘గెస్ట్ చెఫ్’గా వీరు గౌరవాన్ని అందుకుంటున్నారు. ‘మాకు ఇంకా ఎన్నో కలలు ఉన్నాయి’ అంటుంది బృందంలో సభ్యురాలైన నూర్జహాన్.
చదవండి: Blood Washing: ‘బ్లడ్‌వాషింగ్’ అంటే?: విదేశాల్లో బ్లడ్‌వాషింగ్‌కు పాల్పడుతున్న కోవిడ్ బాధితులు!
Comments
Please login to add a commentAdd a comment