వారం కిందట నాకు నార్మల్ డెలివరీ అయింది. ఎన్ని రోజుల్లో మళ్లీ నార్మల్ లైఫ్‌కి వచ్చేస్తాను? ఈలోపు ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే.. ఎలాంటి సమస్యకు హాస్పిటల్‌కి వెళ్లాలి? – యోగిత, దేవరకొండ
డెలివరీ అయిన తరువాత తల్లికి, బిడ్డకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రెండు వారాల తరువాత ఇద్దరినీ చెకప్‌కి తీసుకువెళ్ళాలి. కొన్ని హై రిస్క్ కేసుల్లో ఐదవ రోజే చెకప్‌కి వెళ్ళాలి. బేబీకి సరిగ్గా పాలు ఇవ్వడం, నిద్ర పుచ్చటం, టైమ్‌కి మల్టీ విటమిన్ డ్రాప్స్ వేయడం లాంటివి చేయాలి. జాండీస్ చెకింగ్ గురించి కూడా డిశ్చార్జ్ టైమ్‌లో చెప్తారు. బేబీ ఎక్కువగా ఏడుస్తున్నా, యూరిన్, మోషన్ పాస్ చెయ్యకపోయినా, బరువు తగ్గిపోతున్నా, చర్మం పసుపు రంగులోకి మారినా వెంటనే డాక్టర్‌ని కలవాలి. మీరు సరైన పోషకాహారం తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
మొదటి వారంలో మీకు ఫీవర్, బాడీ పెయిన్స్ ఉన్నాయా అని చూస్తారు. బిడ్డకి పాలు పట్టించడంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే సరి చేస్తారు. యూటరస్ పెయిన్ చాలా కామన్‌గా ఉంటుంది. అది యూటరస్ నార్మల్ సైజు అవుతున్నప్పుడు వచ్చే పెయిన్ మాత్రమే! నార్మల్‌గా బ్లీడింగ్ 12 వారాల వరకు ఉంటుంది. ఒకవేళ మీకు హై టెంపరేచర్, తట్టుకోలేని పొట్టనొప్పి, బ్రెస్ట్ పెయిన్, హెవీ బ్లీడింగ్, క్లాట్స్, వెజైనా పెయిన్, ఫౌల్ వెజైనల్ డిశ్చార్జ్ ఉంటే అవి ప్రమాదం. వెంటనే డాక్టర్‌ని కలవాలి. తల తిరుగుతున్నట్లు, స్పృహ కోల్పోతున్నట్లు అనిపించినా, కాళ్లలో రక్తం గడ్డకట్టినా ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళాలి. బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్ అంటే బ్రెస్ట్‌లో నొప్పి పుట్టించే గడ్డలు వచ్చినా డాక్టర్‌ని కలవాలి. కొంత యాంగై్జటీ, భయం అందరికీ ఉంటాయి. ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా మాట్లాడవచ్చు.
బిడ్డకు పాలు ఇచ్చే సందేహాల మీద ఇంటి నుంచే సలహాలు తీసుకోవచ్చు. మెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యమైనది. హెల్దీ ఫుడ్ తీసుకోవడం, రోజూ కొంత సమయాన్ని మీకోసం కేటాయించుకొని మంచి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మీకు వెజైనా వద్ద కుట్లు వేసుంటే రెండు వారాల్లో మానిపోతాయి. కొన్నిసార్లు పెయిన్‌కిల్లర్స్ ఎక్కువ రోజులు వాడాల్సివస్తుంది. డెలివరీ అయిన వెంటనే పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజులు ప్రారంభించాలి. దీనికి సంబంధించి డిశ్చార్జ్‌కి ముందే డాక్టర్‌ని అడిగి తెలుసుకోవాలి. మలబద్ధకం చాలామందికి ఉంటుంది. మైల్డ్ లాక్సాటివ్స్ వాడాలి. ఒకటి రెండు వారాల్లో ఎక్సర్‌సైజులు, డైట్‌తో నార్మల్ అవుతుంది. ప్రమాదకరమైన మార్పులు లేనప్పుడు రెండు వారాల తరువాత డాక్టర్‌ని కలవాలి. ప్రతి నెలా బేబీకి చెకప్స్ ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment