ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది.
కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్‌ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా.
చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్‌లోయలో అవి ఎక్కడా దొరకలేదు.
బెంగళూరులో శిక్షణ
కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్‌షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది.
ప్రభుత్వ సహకారంతో..
కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment