గీతా జయంతి ప్రత్యేకం..
సర్వధర్మములను విడనాడి నన్నే శరణు పొందు. నేను నిన్ను అన్ని పాపముల నుండి విడిపించెదను. నీవు శోకింప తగదు! — అధ్యాయం 18: శ్లో 66
మహర్షి వ్యాసులవారు రచించిన భగవద్గీతకు పరమహంస యోగానంద చేసిన విస్తారమైన అనువాదము, వివరణలో ఆ మహా యోగివర్యులు కృష్ణ భగవానుడు తన శిష్యుడైన అర్జునునికి చేసిన వాగ్దానానాన్ని ఈ విధంగా అనువదించారు; “నీవు అహంకార జనితాలైన కర్తవ్యాలను విస్మరించి, నేను నిర్దేశించిన దివ్య కర్తవ్యాలను నిర్వహిస్తూ, నాలోనే ఆనందిస్తే, విముక్తిని పొందుతావు.”
ఆధ్యాత్మిక గ్రంథరాజమైన ‘ఒక యోగి ఆత్మ కథ’ రచయిత, ఒక శతాబ్ది కంటే ఎక్కువ కాలం క్రితమే యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ ను స్థాపించిన పరమహంస యోగానంద ఈ విశ్వంలోని మొత్తం సమాచారం గీతలోని 700 శ్లోకాల్లో నిబిడీకృతమై ఉన్నదనీ, “భగవంతుని చేరుకోవడానికి చేసే ప్రయాణంలో ఎవరు ఏ స్థాయిలో ఉన్నా, వారి ఆధ్యాత్మిక ప్రయాణంలోని ఆ భాగం పైన గీత తన కాంతిని ప్రసరిస్తుందనీ” వివరించారు.
యోగానందగారు గీతా వ్యాఖ్యానం పై తమ పనిని తన గురువు అయిన శ్రీయుక్తేశ్వర్ గిరి, శ్రీ శ్రీ లాహిరీ మహాశయులు మరియు శ్రీకృష్ణ భగవానుడు గీతలో రెండుసార్లు ప్రస్తావించిన పవిత్ర క్రియాయోగ ప్రక్రియను పునరుజ్జీవింపచేసిన మహావతార్ బాబాజీ తమ అంతర్దృష్టితో చేసిన మార్గదర్శకత్వంలో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభించారు. యోగానంద ఈ విధంగా విశదపరిచారు; “ఒక దైవ సాక్షాత్కారం పొందిన గురువు సహాయంతో, సహజావబోధాజనిత అంతర్దృష్టితో కూడిన గ్రహణశక్తి అనే ఆడకత్తెరను ఉపయోగించడం ద్వారా భాష ,నిగూఢత అనే గట్టి పెంకును పగలగొట్టి, ధార్మిక బోధలలోని లోపలి సారమైన సత్యాన్ని అందుకోవడం ఎలాగో మనం నేర్చుకోగలుగుతాము.“
1952 లో జరిగిన తమ మహా సమాధికి కొద్ది నెలల ముందు గీతలోని లోతైన అధ్యాత్మిక భావాల అంతిమ సమీక్ష మరియు వివరణ కాలిఫోర్నియాలోని మొజావే ఎడారిలోని ఒక చిన్న ఆశ్రమంలో ఏకాంతవాసంలో గురుదేవులు చేపట్టారు. “ఆ గదిలోని స్పందనలు (యోగానంద ఈ రచనా వ్యాసంగం చేపట్టిన గదిలో) నమ్మశక్యం కాకుండా ఉన్నాయి; ఆ గదిలోకి వెళ్తుంటే భగవంతుడిలోకి ప్రవేశిస్తున్నట్లే ఉండేది.” అని అక్కడి సన్న్యాసి ఒకరు గుర్తుచేసుకొన్నారు.
యోగానంద బృహత్కృషి కేవలం గీతను తన స్వంత భావాల ప్రకారం, మేధస్సుతో మెలితిప్పి అర్థం చేప్పి వివరించడంలో కాకుండా, శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మధ్య జరిగిన నిజమైన సంభాషణను మహర్షి వ్యాసులవారికి తమ ‘బ్రహ్మానంద స్థితిలోని వివిధ స్థాయిలలో’ ఏవిధంగా వెల్లడి అయిందో దానిని ప్రపంచానికి వివరించడంలో ఉంది.
అలా ‘గాడ్ టాక్స్ విత్ అర్జున’ సర్వవ్యాప్త పరమాత్మ (శ్రీకృష్ణుడు) కు, అర్జునుడి రూపంలోని ఒక ఆదర్శ భక్తుడి ఆత్మకు మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. గ్రహించగలిగిన భక్తుడికి మొట్టమొదటి అధ్యాయం నుండే కురుక్షేత్ర యుద్ధం యొక్క చారిత్రక నేపథ్యాన్ని ప్రతి వ్యక్తిలోనూ — ఆత్మతో సంబంధం కలిగిన స్వచ్చమైన విచక్షణాయుత మేధస్సు (పాండు పుత్రులు) కు,అహంకారం అనే మాయకు లోనైన ఇంద్రియబద్ధమైన గుడ్డి మనస్సు (గ్రుడ్డి వాడైన ధృతరాష్ట్రుడు, అతడి కుటిల సంతానం) కు మధ్య — జరుగుతున్న ఆధ్యాత్మిక,మానసిక యుద్ధాన్ని వివరించడానికి పోలికగా ఊపయోగిస్తున్నారని స్పష్టమౌతుంది.
కృష్ణుడి (గురువు లేక జాగృతమైన ఆత్మ చైతన్యం, లేక ధ్యాన జనిత సహజావబోధం) సహాయంతో యుద్ధం చేయాలి; భౌతికంగా, మానసికంగా, అధ్యాత్మికంగా ‘రాజ్యాన్ని అహంకారం నుండి, మరియు దుష్ట మానసిక ప్రవృత్తులనే దాని సైన్యం నుండి తిరిగి స్వాధీనపరచుకోవడం,’ తద్ద్వారా సర్వసమర్థ ఆత్మ సామ్రాజ్యాన్ని స్థాపించడం. కృష్ణుడు శోకతప్తుడైన అర్జునునికి నిశ్చయమైన ఓదార్పును అందించినట్టే, యోగానంద ప్రతి నిజమైన అధ్యాత్మిక అన్వేషకుడిలో ఉన్న అర్జునునికి తన అపూర్వమైన పలుకులతో ఈ విధంగా సలహా ఇచ్చారు. ”ప్రతి వ్యక్తీ తన కురుక్షేత్ర యుద్ధాన్ని తానే పోరాడి గెలవాలి. ఇది కేవలం గెలవ తగిన పోరు మాత్రమే కాదు, ఈ విశ్వానికి నిర్దేశింపబడిన దివ్య న్యాయాన్ని అనుసరించి, జీవాత్మకు పరమాత్మతో ఉన్న శాశ్వత సంబంధాన్ననుసరించి, ముందో తరువాతో తప్పక గెలవాల్సిన యుద్ధమిది.” గాడ్ టాక్స్ విత్ అర్జున‘, క్రియాయోగం గురించిన మరింత సమాచారంకోసం:yssofindia.org
Comments
Please login to add a commentAdd a comment