Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్‌ భీకర రూపం  రహస్యం ఇదేనా?  | Do You Know About Secret Behind Pushpa 2 Movie Allu Arjun Pushpa Raj Jatara Look, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Allu Arjun Jatara Look Secret: పుష్పరాజ్‌ భీకర రూపం  రహస్యం ఇదేనా? 

Published Mon, Apr 8 2024 3:41 PM | Last Updated on Mon, Apr 8 2024 5:15 PM

Pushpa 2 Allu Arjun jatara look as Pushpa Raj check the secret behind - Sakshi

పుష్ప సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో  స్టయిలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రేంజ్‌  పీక్‌కు చేరింది.  ఈ మూవీకి జాతీయ ఉత్తమ అవార్డు గెలుచు కుని మరో మెట్టు ఎక్కాడు అల్లు అర్జున్. దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2: ది రూల్' పై అంచనాలు కూడా అదే రేంజ్‌లో ఉన్నాయి.  దీనికి తగ్గట్టుగానే ‌పుష్ప 2 సినిమా టీజర్‌లో అల్లు అర్జున్ నీలి రంగు చీర, నగలు, నిమ్మకాయ దండలతో వెరైటీ లుక్‌ హాట్‌టాపిక్‌గా నిలిచింది. దీంతో  అభిమాన హీరో  కొత్త ట్రెండ్ సెట్ చేయడం ఖాయమని ఫిక్స్‌ అయిపోయారు ఫ్యాన్స్‌. 

2003లో గంగోత్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అల్లు అ‍ర్జున్‌ ..ఈ మూవీలో లేడీ గెటప్‌తో  కనిపించి అలరించాడు. తాజాగా పుష్ప-2 సినిమాలో కూడా అమ్మవారి భీకర రూపంతో ఫ్యాన్స్‌ని మరింత ఎట్రాక్ట్‌ చేస్తున్నాడు. ఎర్రచందనం, తిరుపతి జిల్లాలో కథ సాగుతుంది కనుక ఇది గంగమ్మ జాతర నేపథ్యమే   ఈ లుక్‌అని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఏంటీ గంగమ్మ జాతర తెలుసుకుందాం రండి.

తిరుపతి గ్రామదేవత శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ  జాతర అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. గంగమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామదేవతగా అవతరించిన గంగమ్మ.. సాక్షాత్తు తిరుమల శ్రీవారి చెల్లెలని భావిస్తారు. వారం రోజుల పాటు జరిగే గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేకత ఉంది.

గంగమ్మ జాతర విశిష్టత
పూర్వం తిరుపతిని పాలెగాళ్లు పరిపాలించే రోజుల్లో ఒక పాలెగాడు తన రాజ్యంలోని అందమైన యువతులను బలాత్కరించేవాడట. కొత్తగా పెళ్ళైన వధువులంతా మొదటిరాత్రి తనతో గడపాలంటూ ఆంక్షలు విధించి వేధించేవాడట. ఈ పాలెగాడిని అంతమొందించి స్త్రీ జాతిని రక్షించేందుకు జగన్మాత తిరుపతికి 2 కి.మీ దూరంలోని అవిలాల గ్రామంలో కైకాల కులంలో గంగమ్మగా జన్మించిందని భావిస్తారు భక్తులు. యుక్త వయసుకొచ్చిన గంగమ్మపై యథావిధిగా పాలెగాడి కన్నుపడి ఆమెను బలాత్కరించబోయాడట. దీంతో గంగమ్మ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది.. తనను అంతమొందించేందుకు అవతరించిన పరాశక్తే గంగమ్మ అని తెలుసుకున్న పాలెగాడు పారిపోయి దాక్కోవడంతో అనేక వేషాలు ధరించి మూడు రోజులపాటు గాలించినా ఫలితం దక్కలేదు. దీంతో  నాలుగోరోజు గంగమ్మ-దొరవేషం వేసి,  పాలెగాడిని అంత మొందించిందని భక్తుల విశ్వాసం. ఈ దుష్టశిక్షణను తలచుకుంటూ ఆ తల్లి తమను చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఏటా ప్రజలు ఈ జాతర చేసుకుంటారు. 

ఈ జాతరలో తొలి రోజున బైరాగివేషం ,రెండోరోజు బండవేషం,మూడోరోజు తోటివేషం,నాలుగోరోజు దొరవేషం వేసుకుంటారు. నాలుగో రోజున పాలెగాడిని సంహరించిన గంగమ్మ ఐదోరోజున మాతంగి వేషం ధరిస్తారు.  ఆరోరోజు సున్నపుకుండల వేషం వేస్తారు. ఏడోరోజున జాతరలో భాగంగా సప్పరాల ఉత్సవం జరుగుతుంది. గోపురాన్ని పోలిన సప్పరాలను (వెదురు బద్దలతో) తయారుచేసి వాటిని శరీరంపై నిలబెట్టుకుంటారు. అలా చేస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. అదేరోజున కైకాల కులస్థులు పేరంటాళ్ళ వేషం వేస్తారు.మగవారు ఆడవేషం వేసుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలా చేస్తే అమ్మవారు అనుగ్రహించి తమ కోర్కెలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.

పేరంటాలు వేషంలోఉన్న కైకాల కులస్థులు ఆలయానికి చేరుకుని నీలం రంగు ద్రవంతో బంకమట్టిని కలిపి అమ్మవారి భీకరమైన విశ్వరూపాన్నితయారుచేస్తారు. భక్తులంతా అమ్మవారి విశ్వరూపాన్ని దర్శించుకున్నాక ఆ విగ్రహం నుంచిమట్టిని తీసి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. ఎనిమిదిరోజులపాటు ఘనంగా జరిగిన జాతర ఈ ఘట్టంతో ముగుస్తుంది. 

బన్నీ న్యూ లుక్‌ రహస్యం వీడాలంటే  సినిమా రిలీజ్‌ వరకు వెయిట్‌ చేయాల్సిందే. మరోవైపు పుష్ప 2: ది రూల్ టీజర్‌కి రెస్పాన్స్  ఒక రేంజ్‌లో ఉంది.  బన్నీ   మాతంగి  లుక్‌ చూసి  ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. ‘‘మరో  బ్లాక్‌బస్టర్‌..బన్నీకి మరో జాతీయ అవార్డు పక్కా" అని కమెంట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement