ఐదేళ్ల పాటు చీకట్లోనే జీవితం, వీల్‌ చెయిర్‌కే పరిమితం.. అయినా | Sweety Bagga National Wheelchair Basketball Player Spinal Cord Injury | Sakshi
Sakshi News home page

Climber Baljeet Kaur: యాక్సిడెంట్‌లో వెన్నపూస విరిగి వీల్‌చెయిర్‌కే పరిమితం, కానీ ఇప్పుడామె బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌

Published Sat, Sep 23 2023 11:10 AM | Last Updated on Sat, Sep 23 2023 3:34 PM

Sweety Bagga National Wheelchair Basketball Player Spinal Cord Injury - Sakshi

‘‘ఏదో ఒక దశలో పరిస్థితులు మనల్ని పడిపోయేలా చేస్తాయి. అలాగే ఉండిపోకుండా గెలవడానికి ప్రయత్నం చేయి’’ అంటారు హైదరాబాద్‌ కాచిగూడలో ఉంటున్న స్వీటీ బగ్గా (బల్జిత్‌ కౌర్‌) ఇరవై ఏళ్ల వయసులో బస్సు ప్రమాదానికి గురై వెన్నుపూస దెబ్బతిని, నిలబడే శక్తి లేక వీల్‌ చెయిర్‌కే పరిమితమైంది స్వీటీ బగ్గా. అయినా, గెలవడానికి ప్రయత్నం చేసింది. వీల్‌ చెయిర్‌ స్పోర్ట్‌ మారథాన్‌ రన్నర్‌గా నిలిచింది.

నేషనల్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌గా రాణించింది. స్విమ్మింగ్‌ నేర్చుకొని, నీటి అడుగు వరకు వెళ్లొచ్చింది. పారామోటరింగ్‌ చేసి ఔరా అనిపించింది. తనలాంటి వారికి వీల్‌చెయిర్లు పంపిణీ చేస్తూ  తన సహృదయతను చాటుకుంటుంది. అవగాహన కార్యక్రమాల ద్వారా  దివ్యాంగులు జీవితాల్లో వెలుగులు నింపడానికి ప్రయత్నిస్తోంది.

‘‘ఇప్పుడు నా వయసు 60. యాభై నాలుగేళ్ల వయసులో సిమ్మింగ్‌ నేర్చుకున్నాను. పారామోటరింగ్‌ చేశాను. నేలమీద నడవలేను. కానీ, ఆకాశంలో ఎగిరాను, స్కూబా డైవింగ్‌తో నీళ్ల అడుగుకు వెళ్లొచ్చాను. అథ్లెట్‌గా పేరు తెచ్చుకున్నాను. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతల్లోనూ ΄ాలు పంచుకున్నాను. 


ఐదేళ్లు చీకట్లోనే.. 
వీల్‌చెయిర్‌కి పరిమితమైన పరిస్థితులు ఎదురైనప్పుడు మొత్తం జీవితమే కోల్పోయాను అనిపించింది. రేపు అనే దానిపైన ఏ మాత్రం ఆశ ఉండేది కాదు. ఆరు నెలల పాటు డిప్రెషన్‌ నన్ను చుట్టుముట్టింది. నలభై ఏళ్ల క్రితం ఓ రోజు నేనూ, మా బ్రదర్‌ స్కూటర్‌ మీద వెళుతుండగా బస్సు ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో వెన్నుపూస దెబ్బతింది. చికిత్స తీసుకొని ఇంటికి వచ్చానే కానీ, మెడ నుంచి శరీరం కదల్చలేని పరిస్థితి. అప్పటికే పద్దెనిమిదేళ్లకే పెళ్లి, ఇరవై ఏళ్లకు ఇద్దరు పిల్లల తల్లిని.

నన్ను నేనే చూసుకోలేను, ఇక పిల్లల్నేం చూడగలను? కూర్చోబెడితే కూర్చోవడం, పడుకోబెడితే పడుకోవడం... ఐదేళ్ల పాటు సూర్యకాంతి కూడా చూళ్లేదు. కొంత ప్రయత్నంతో చేతులు, తల మాత్రమే పనిచేసేవి. జీవితం ఎంత దుర్లభమో పదేళ్ల పాటు అనుభవించాను. యూరిన్‌ ఇన్ఫెక్షన్స్, బెడ్‌సోర్స్‌.. ఒక సమస్య అని చెప్పలేను. కానీ, మా అమ్మనాన్నలు, మా వారు, అత్తింట్లో అందరూ నన్ను ఓపికగా చూసుకున్నారు. పదేళ్ల తర్వాత చెన్నైలో స్పైనల్‌కార్డ్‌ రిహాబిలిటేషన్‌ సెంటర్‌ గురించి తెలిసి, అక్కడకు తీసుకెళ్లారు ఇంట్లోవాళ్లు. అప్పుడు వాళ్లిచ్చిన సలహాలతో నన్ను నేను మెరుగు పరుచుకోవడం మొదలుపెట్టాను. 



నన్ను నేను మెరుగుపరుచుకున్నా...
ఉమ్మడి కుటుంబం కావడంతో మా ఇంట్లో పిల్లలు ఎక్కువ. ఇంటర్మీడియెట్‌ వరకు చదువుకున్నాను కాబట్టి, పిల్లలందరికీ చదువు చెప్పేదాన్ని. క్రొచెట్‌ అల్లికలు నేర్చుకున్నాను. బొమ్మలు, స్వెటర్లు తయారుచేస్తుంటాను. బంధుమిత్రుల పుట్టిన రోజున వాటిని కానుకగా ఇస్తుంటాను. గార్డెనింగ్‌ చేస్తాను. నాకు తెలుసు, జీవితంలో కాలినడక ఉండదని.అయినా, నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి నిరంతరం తపించేదాన్ని.

ఒకప్పటితో పోల్చితే నాలాంటి వారికి ఇప్పటి రోజులు కాస్త సులువు. వీల్‌చెయిర్‌ సాయంతో నా పనులు నేను చేసుకోవడం వరకు చాలా దశలు దాటాను. పదేళ్లుగా వాలీబాల్, స్విమ్మింగ్‌ చేస్తున్నాను. పారా అథ్లెటిక్‌ పోటీలలో పాల్గొంటున్నాను. పాండిచ్చేరి వెళ్లినప్పుడు అక్కడ స్కూబా డైవింగ్‌ కూడా చేశాను. హాట్‌ ఎయిర్‌ బెలూన్‌లో ఆకాశంలోకి ఎగిరాను. స్ట్రాంగ్‌ విల్‌పవర్‌ కావాలంటే నన్ను నేను నిరంతరం మార్చుకోవాలని ఇప్పటికీ తపిస్తూనే ఉన్నాను. 

వీల్‌చెయిర్‌.. పవర్‌
స్పైనల్‌ కార్డ్‌ దెబ్బతిని, బెడ్‌కు పరిమితమైన వారి గురించి అక్కడక్కడా వార్తలు తెలుస్తుండేవి. సోషల్‌మీడియా ద్వారా ఇంకొంతమంది పరిచయం అయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల క్రితం వీళ్లందరికీ వీల్‌చెయిర్స్‌ ఇస్తే బాగుంటుంది అనుకున్నాను. ఇదే విషయాన్ని మా ఇంట్లోవాళ్లతో చె΄్పాను. ‘ఐయామ్‌ పాజిబుల్‌’ పేరుతో ఫౌండేషన్‌ని రిజిస్టర్‌ చేయించాను. ఇంట్లోవాళ్లనే ఒక్కొక్కరూ ఒక్కో వీల్‌చెయిర్‌ కొనిమ్మని చెప్పాను. అలా, తొమ్మిది వీల్‌ చెయిర్లు వచ్చాయి. మరికొన్ని నా బంధువులు, మిత్రులతో కొనిపించాను.

మొదటి ఏడాది 33 మందికి వీల్‌ చెయిర్లు ఇచ్చాను. కోవిడ్‌ టైమ్‌లో ఇవ్వలేకపోయాను. కిందటేడాది వీల్‌చెయిర్‌ ర్యాలీ చేశాం. సీనియర్‌ సిటిజన్స్, పోలియో వచ్చినవారికీ వీల్‌చెయిర్లు ఇస్తున్నాం. స్పైనల్‌కార్డ్‌ అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ ఏడాదికి ఒకసారి ఏర్పాటు చేస్తున్నాను. దీనిద్వారా తగినంత స్ఫూర్తి అంది, వారి జీవితాలను బాగు చేసుకుంటారనేది నా ఆశ.  

వీడియోల ద్వారా అవగాహన..
వెన్నుపూస దెబ్బతిన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోజూ ఎలా ఉండాలి.. అనే విషయాల మీద వీడియోలు చేసి సమస్య ఉన్నవారికి పోస్ట్‌ చేస్తుంటాను. యూట్యూబ్‌ ద్వారా దివ్యాంగుల కోసం నన్ను నేను ఉదాహరణగా చూపుతూ వీడియోలు చేస్తుంటాను. ఏ కారణంగానైనా వీల్‌చెయిర్‌కి పరిమితమైనవారు ఇంట్లోనే ఉండిపోకుండా తమకు తాముగా స్వయం ఉపాధి పొందమని చెబుతుంటాను. ఉదాహరణకు.. ఇంటి ముందు చిన్న టేబుల్‌ వేసుకొని చాయ్‌ బిస్కెట్‌ లేదా కూరగాయలు అమ్మమని చెబుతుంటాను.

రోజుకు వందో, రెండు వందలో ఆదాయం వచ్చినా వారికెంతో ఆదరువు అవుతుందంటూ చిన్న చిన్న సూచనలు చేస్తుంటాను. చదువుకున్నవారైతే ట్యూషన్లు చెప్పమని, కుట్లు అల్లికల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని వివరిస్తుంటాను. ఇప్పటివరకు తెలంగాణలో 180, ఆంధ్రప్రదేశ్‌లో 200 మందిదాకా స్పైనల్‌ కార్డ్‌ సమస్య బాధితులు ఉన్నారని తెలిసింది. ఇంకా మన దృష్టికి రానివారు ఎందరున్నారో.

వివిధ రాష్ట్రాల నుంచి కూడా వీల్‌ చెయిర్‌ కావాలని అడిగిన వారున్నారు. సెప్టెంబర్‌ నెలలో స్పైనల్‌కార్డ్‌ ఇంజ్యూరీ సర్వీస్‌ డే ఉంది. దీనిని పురస్కరించుకొని ప్రతి ఏటా కార్యక్రమం ఏర్పాటు చేస్తుంటాను. ఆ విధంగా ఈ  ఏడాది డెబ్భైమూడు మందికి వీల్‌చెయిర్లు పంపిణీ చేస్తున్నాను. దీనికి ఎంతోమంది తమ సహకారాన్ని అందించారు.

ఈ నలభై ఏళ్ల జీవితం నన్ను మానసికంగా ఎంతో బలవంతురాలిని చేసింది. యుద్ధంలో పోరాడాలంటే యోధుడిలాగే ఉండాలి. గాయాలు అయినా, పడిపోయినా.. నిరంతరం మనల్ని మనం కొత్తగా మలుచుకుంటూ, ఆవిష్కరించుకుంటూ ఉండాలి. ఇదే విషయాన్ని తరచూ చెబుతూ నాలాంటి వారిని మోటివేట్‌ చేస్తుంటాను’’ అని వివరించారు స్వీటీ బగ్గా. 
– నిర్మలారెడ్డి
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement