పెండింగ్ పనులు పూర్తిచేయండి
కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశం
గుంటూరు వెస్ట్: పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, రోడ్లు భవనాల శాఖ, జీఎంసీ తదితర శాఖల్లో అభివృద్ది పనులు అనుకున్నంత వేగంగా సాగడంలేదన్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో శాఖల మధ్య సమన్వయం కొరవడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. కొన్ని అర్జీలు తూతూ మంత్రంగా పరిష్కరించి మూసేస్తున్నారని చెప్పారు. అధికారుల తీరు మార్చుకోవాలని సూచించారు. అనంతరం వచ్చిన 211 ఫిర్యాదులను కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్ తేజ, డీఆర్వో పెద్ది రోజా, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డెప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
టీడీపీ నాయకుడి భూకబ్జాలపై ఫిర్యాదు
పొన్నూరు: మండలంలోని మన్నవ గ్రామంలో టీడీపీ నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, తగిన చర్యలు తీసుకుని అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని గ్రామ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావు గుంటూరు కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవెన్స్‌లో సోమవారం ఫిర్యాదు చేశారు. టీడీపీ పొన్నూరు మండల అధ్యక్షుడైన బండ్లమూడి బాబూరావు కొడుకు బండ్లమూడి చింపిరయ్య మన్నవ గ్రామ పంచాయతీ పరిధిలోని డి.నెం. 412–4లో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించాడని తెలిపారు. ఆ భూమిలో గుడిసె వేసి బిల్ కలెక్టరు వాకా శ్రీనివాసరావు, పంచాయతీ సెక్రెటరీ దార్ల లక్ష్మీ నారాయణ సంతకాలను ఫోర్జరీ చేసి, అసెస్మెంట్ నంబరు 66తో నకిలీ ఇంటి పన్ను రశీదును సృష్టించాడని వివరించారు. వాస్తవానికి మన్నవ గ్రామ పంచాయతీ డిమాండ్ రిజిస్టర్‌లో అసెస్మెంట్ నంబర్ 66 బండ్లమూడి బాబూరావు పేరుపై ఉందని, ఆయన తన ఇంటికి పన్ను చెల్లించినట్లు పంచాయతీ రికార్డులో ఉందని వెల్లడించారు. ఆ ప్రభుత్వ స్థలం తన పూర్వీకుల ఆస్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వాటి ఆధారంగా విజయవాడలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో రూ. 5 లక్షల రుణం తీసుకున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేయటమేగాక, ఫైనాన్స్ కంపెనీని మోసగించి అక్రమంగా రుణం తీసుకున్న బండ్లమూడి చింపిరయ్యపై విచారణ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నాగమల్లేశ్వరరావు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment