గుంటూరు నీటికి ‘అమరావతి’ మెలిక
నెహ్రూనగర్: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమృత్ 2.0 పథకం కింద గుంటూరు నగరపాలక సంస్థకు రూ.184 కోట్లు మంజూరయ్యాయి. వచ్చే 15 ఏళ్లలో అప్పటి జనాభాకు సరిపడా తాగునీరు అందించేందుకు వీటిని వినియోగించాల్సి ఉంటుంది. భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చేందుకు చేసిన ప్రతిపాదనలతో సిద్ధమైన డీపీఆర్‌పై ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ) స్పందిస్తూ మార్పు చేయాలని సూచించడంతో అమలు ప్రశ్నార్థకమైంది. అమృత్ 2.0 పథకంలో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు భవిష్యత్తు నీటి అవసరాలకు తగ్గట్లుగా డీపీఆర్ (డిటైయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేశారు. దీనిని ఆమోదం నిమిత్తం ఈఎన్‌సీ, ఏపీయూఎఫ్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)కు పంపించారు. ఈఎన్‌సీ దీనిపై అభ్యంతరాలు లేవనెత్తారు. ఉన్న వనరు కాదని ప్రత్యామ్నాయంగా అమరావతి నుంచి నీటిని గుంటూరు తీసుకువచ్చే అంశంపై దృష్టి సారించాలనడంతో కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
ప్రస్తుత పరిస్థితి ఇదీ...
గుంటూరు నగరపాలక సంస్థకు విజయవాడ కృష్ణా నది నుంచి ఉండవల్లి, మంగళగిరిల మీదుగా తక్కెళ్లపాడు హెడ్ వాటర్ వర్క్స్‌కు నీరు వస్తోంది. అక్కడి నుంచి గుంటూరు నగరానికి అవసరమైన తాగునీటిని అన్ని రిజర్వాయర్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ప్రస్తుతం నగర జనాభా దాదాపు 11 లక్షలు. వీరికే సరిపడా నీరు రావడం లేదనే చెప్పాలి. ప్రస్తుతం కృష్ణా నది నుంచి గుంటూరుకు వస్తున్న 149 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) ఏ మాత్రం సరిపోవడం లేదు. పేరుకు ఇంత వస్తున్నా పైపులైన్ల లీకేజీ, నిర్వహణ లోపాలతో 130 ఎంఎల్‌డీలే వస్తున్నట్లు సమాచారం. డీపీఆర్ ప్రకారం నగర జనాభా వచ్చే 15 ఏళ్లలో దాదాపు 20 లక్షలు అవుతుందని భావిస్తున్నారు. దానికి అనుగుణంగా మరో 75 ఎంఎల్‌డీల సామర్థ్యం పెంచేందుకు డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
అదంతా పెద్ద టాస్కే...
వాస్తవానికి అమరావతి నుంచి గుంటూరుకు నీటిని తీసుకుని రావాలంటే పెద్ద టాస్కే అని చెప్పాలి. అమరావతిలో నీటి నిల్వలు తక్కువగా ఉంటాయి. ఒక వేళ రూ. కోట్లు ఖర్చు పెట్టి నీటిని తీసుకురావాలని ప్రయత్నం చేసినా సరిపడా నిల్వలు లేకపోవడం వల్ల ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఆ ప్రయత్నం చేసినా వైకుంఠపురం వద్ద డ్యాం కట్టాల్సి ఉంది. అప్పుడు మరింత అదనపు ఖర్చు తప్పదు. గుంటూరుకు ప్రత్యామ్నాయ తాగునీటి పథకం కోసం ఈ ఆలోచన చేసే కంటే .. ఉన్న పైపులైనును, వనరులను సమర్థంగా వినియోగించడం మేలనే వాదనలు వినిపిస్తున్నాయి. డీపీఆర్ ప్రకారం ఇక్కడ 375 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన భారీ మోటార్లు రెండు ఏర్పాటు చేయనున్నారు. తక్కెళ్లపాడులో 75 ఎంఎల్‌డీలు ఫిల్టర్ అయ్యేలా ఫిల్టరేషన్ ప్లాంటు కట్టాలని కూడా డీపీఆర్‌లో ఉంది. ఈ పథకం పూర్తి స్థాయిలో అమలైతే విలీన గ్రామాలకు కూడా నీటి కష్టాలు తీరనున్నాయి. సుమారు 33 కిలోమీటర్ల మేర పైపులైన్లు లేని చోట కొత్తగా వేయడం, అదనంగా 20 వేలకుపైగా ట్యాప్ కనెక్షన్లు ఇచ్చేందుకు కసరత్తు కొనసాగుతోంది. డీపీఆర్‌కు ఆమోదం తెలిపితే రెండేళ్లలో పనులు పూర్తి చేయనున్నారు.
రూ.184 కోట్లతో గుంటూరులో ‘అమృత్ 2.0’ ఆమోదానికి డీపీఆర్ పంపిన నగరపాలక సంస్థ అమరావతి నుంచి నీరు తేవాలని ఈఎన్‌సీ సూచన కృష్ణా నది ఉండగా ఇదేంటని కార్పొరేషన్ మల్లగుల్లాలు
భవిష్యత్తు అవసరాల కోసమే
రాబోయే 15 సంవత్సరాలలో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని అమృత్ 2.0 పథకం అమలుకు డీపీఆర్ సిద్ధమైంది. ఈఎన్‌సీ, ఏపీయూఎఫ్‌ఐడీసీకి పంపాం. వీలైనంత త్వరలో ఆమోదం పొందనుంది. రెండేళ్లలో ఈ పథకం పూర్తి చేసి ప్రతి ఇంటికి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– నాగ మల్లేశ్వరరావు,
ఎస్‌ఈ, గుంటూరు కార్పొరేషన్
Comments
Please login to add a commentAdd a comment