పట్నంబజారు: ‘‘పోలీసు బాస్... పొలిటికల్ బాస్‌ల కోసం పనిచేస్తున్నారు. తమ పరిధి దాటి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణం. గుర్తుపెట్టుకోండి.. మాకూ ఒక రోజు వస్తుంది. కచ్చితంగా ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమని’’ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజిని స్పష్టం చేశారు. శ్యామలానగర్‌లోని తన నివాసంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లు, సానుభూతిపరులు, అభిమానులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయటంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేటకు చెందిన పెద్దిరెడ్డి సుధారాణి, ఆమె భర్త వెంకటరెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. సిరిసిల్ల నుంచి బలవంతంగా తీసుకొచ్చి చిలకలూరిపేట టౌన్ స్టేషన్‌లో అక్కడి సీఐ టార్చర్ చేయటంపై మండిపడ్డారు. న్యాయస్థానంలో ఆమె ఆవేదన వినేందుకు గంట సమయం కేటాయించారంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వారి కుటుంబసభ్యులు, తమపై సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత హననం చేస్తుంటే.. ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవటం సిగ్గుచేటన్నారు. తాను స్వయంగా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినా డీజీపీ, ఎస్పీ ఇంతవరకు స్పందించకపోవటంపై ప్రశ్నించారు. చట్టం మీకు ఒకలా.. మాకు ఒకలా ఉంటుందా? అని నిలదీశారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ స్పష్టంగా లా అండ్ ఆర్డర్ రాష్ట్రంలో ఎలా ఉందో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. బాధితులకు జగనన్న, తాము అండగా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment