సనాతన వైదిక ధర్మం ఎంతో గొప్పది
నరసరావుపేట ఈస్ట్: దేశంలో అనాదిగా కొనసాగుతున్న హిందూ ధర్మాన్ని సనాతన వైదిక ధర్మంగా గుర్తించాలని శృంగేరీ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి శ్రీవిదుశేఖర భారతీ స్వామి తెలిపారు. శ్రీవిదుశేఖర స్వామి విజయ యాత్రలో భాగంగా బుధవారం రాత్రి పట్టణంలోని శ్రీశృంగేరీ శంకర మఠానికి చేరుకున్నారు. వేద పండితుల స్వాగత వచనాల మధ్య శంకర మఠానికి విచ్చేసిన స్వామి మఠం ఆవరణలోని శారదాంబ అమ్మవారిని దర్శించుకొని హారతి సమర్పించారు. అలాగే శ్రీశంకర చంద్రమౌళీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులు పాదుకా పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విదుశేఖర స్వామి అనుగ్రహ భాషణ చేశారు. ప్రస్తుతం మనం పిలుచుకుంటున్న హిందూ ధర్మానికి మరో పేరు సనాతన వైదిక ధర్మమని అభివర్ణించారు. ఇది మన ధర్మం గొప్పతనాన్ని సూచిస్తున్నదని వివరించారు. ప్రపంచం దేని ద్వారా ధరింపబడుతుందో దానిని ధర్మం అంటారని తెలిపారు. ధర్మం, అధర్మం ఈ రెండూ నేడు మనిషిని నడిపిస్తున్నాయని, ఆశా జీవిగా మనిషి అన్నీ తనకు అనుకూలంగా కావాలనుకుంటూ స్వార్థంతో వ్యవహరిస్తాడని తెలిపారు. అయితే ధర్మం ఏదివ్వాలో దానినే అందిస్తుందని తెలిపారు. అనుగ్రహ భాషణ అనంతరం స్వామి రామిరెడ్డిపేటలో కొత్తగా నిర్మించిన వేద విద్యార్థుల వసతి గృహం వేదభారతీ గృహాన్ని ప్రారంభించారు. వేదభారతి వద్దకు చేరుకున్న స్వామి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి అక్కడే బస చేశారు. ఈ కార్యక్రమాలలో నరసరావుపేట జమిందార్ కొండలరావు బహదూర్, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, బులియన్ మర్చంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కపలవాయి విజయకుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్త పాల్గొన్నారు,
శ్రీశ్రీ విదుశేఖర భారతీ స్వామి అనుగ్రహ భాషణం పట్టణంలో సాగిన విజయ యాత్ర వేదభారతీ వసతి గృహాన్ని ప్రారంభించిన స్వామి
నేటి స్వామి పర్యటన ఇలా..
విదుశేఖర భారతీ స్వామి గురువారం ఉదయం పాతూరులోని శ్రీభీమలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. శ్రీభీమలింగేశ్వరస్వామి నగరోత్సవానికి సిద్ధం చేసిన నూతన దివ్య రథాన్ని ప్రారంభించి పాత శంకర మఠంను సందర్శిస్తారు. అక్కడి నుంచి కోటప్పకొండ చేరుకొని శ్రీత్రికోటేశ్వరస్వామికి పూజలు నిర్వహిస్తారు. కోటప్పకొండ నుంచి మిన్నెకల్లు గ్రామానికి చేరుకొని అక్కడ శ్రీశ్రీభారతీ తీర్థస్వామి పూర్వాశ్రమ మాతృమూర్తి పేరుతో నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభిస్తారు. తిరిగి శంకర మఠం చేరుకొని భక్తుల పూజలు స్వీకరించి సాయంత్రం 4 గంటల సమయంలో తన విజయ యాత్రను కొనసాగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment