నెహ్రూనగర్: అరండల్ పేట నుంచి కొత్తపేట వైపు వెళ్లే ప్రధాన మార్గమైన మూడు వంతెనల వద్ద రైల్వే శాఖ నూతన ట్రాక్ ఎక్స్‌టెన్షన్ పనుల నిమిత్తం ఈ నెల 25 నుంచి 60 రోజుల పాటు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఆయన గురువారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో రైల్వే, ట్రాఫిక్, ఆర్ అండ్ బీ, జీఎంసీ అధికారులతో రాకపోకల నిలిపివేత, ప్రత్యామ్నాయ చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన ట్రాక్‌ని ఎక్స్‌టెన్షన్ చేయడానికి 60 రోజుల పాటు మూడు వంతెనల మార్గంలో రాకపోకలు నిలిపివేయాలని రైల్వే అధికారులు కోరినట్లు తెలిపారు. నగర ప్రజలు నెహ్రూనగర్ గేటు, శంకర్ విలాస్ వంతెన వైపు నుంచి కొత్తపేటకు వెళ్లాలని ఆయన సూచించారు. ఆర్ అండ్ బీ అధికారులు శంకర్ విలాస్ వంతెనపై రోడ్ ప్యాచ్ వర్క్‌లను చేపట్టాలని, ట్రాఫిక్ పోలీసులను సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో నగరపాలక సంస్థ ఎస్‌ఈ నాగమల్లేశ్వరరావు, సిటీ ప్లానర్ రాంబాబు, ఆర్ అండ్ బీ డీఈఈ చిన్నయ్య, పశ్చిమ ట్రాఫిక్ సీఐ సింగయ్య, రైల్వే అధికారి జగన్మోహనరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment