మా ఫిర్యాదులపై చర్యలేవి?
లక్ష్మీపురం: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్, ఆయన కుటుంబం, తన కుటుంబంపై పోస్టులు పెట్టిన మంత్రి లోకేశ్, స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసులు ఎందుకు రిజిస్టర్ చేయలేదని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులను నిలదీశారు. శనివారం సాయంత్రం పాత గుంటూరు, లాలాపేట, అరండల్‌పేట, నగరంపాలెం, పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లకు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఫిర్యాదుదారులతో కలిసి వెళ్లారు. ఐ–టీడీపీ సోషల్ మీడియాపై ఇచ్చిన ఫిర్యాదులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17, 18, 19వ తేదీల్లో నగరంలోని ఐదు పోలీస్‌స్టేషన్‌లలో 10 ఫిర్యాదులు చేశామని తెలిపారు. వాటి దర్యాప్తు గురించి తెలుసుకునేందుకు స్టేషన్‌లకు వెళ్లినట్టు చెప్పారు. ఎస్‌హెచ్‌వోలు లేరని, ఫోన్ చేసి ఫిర్యాదుల గురించి అడిగితే పరిశీలిస్తున్నామని, విచారణ చేస్తున్నామని చెబుతున్నారన్నారు. ఫిర్యాదు చేసిన తరువాత ముందు కేసు రిజిస్టర్ చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాల్సింది పోయి పరిశీలిస్తున్నామని చెప్పడం సరికాదన్నారు. అదే లోకేశ్ ఫిర్యాదు చేస్తే మాత్రం పోలీసు శాఖ వెంటనే వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు 100మందిపై సుమారు 300పైగా కేసులు రిజిస్టర్ చేసిందని చెప్పారు. అర్ధరాత్రి వేళ అరెస్టులు చేసి, థర్డ్ డిగ్రీ కూడా ప్రయోగించారన్నారు. మరి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదులపై పోలీసులు ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదని నిలదీశారు. పోలీసుల పనికి లోకేశ్ అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. అవసరమైతే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడతామని, అప్పటికీ న్యాయం జరగకపోతే న్యాయస్థానాలను ఆశయ్రిస్తామని స్పష్టం చేశారు. సాక్షాత్తూ డీజీపీ సైతం లోకేశ్ చెప్పిన విధంగానే నడుచుకుంటున్నారని ఆరోపించారు. అంబటి రాంబాబు వెంట పార్టీ మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజ నారాయణ, నాయకులు అంగడి శ్రీనివాసరావు, కార్పొరేటర్లు, మహమూద్, మల్లవరపు రమ్య, బూసి రాజలత, ధూపాటి వంశీ, కో–ఆప్షన్ సభ్యుడు పూనూరి నాగేశ్వరావు, లీగల్ సెల్ నాయకులు భగవాన్ తదితరులు ఉన్నారు.
త్వరలో ప్రైవేటు కేసులు వేస్తాం...
వైఎస్సార్‌సీపీ కార్పొటర్లు, నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోకుండా ఇదే తరహాలో పోలీసులు చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అంబటి స్పష్టం చేశారు. ప్రైవేటు కేసులు వేసి అక్కడే తేల్చుకుంటామని చెప్పారు.
లోకేశ్, అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోరా? వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎలా జైలుకు పంపారు? ఐ– టీడీపీపై ఫిర్యాదు చేస్తే స్పందించరా? గుంటూరులోని ఐదు పోలీస్‌స్టేషన్‌లకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment