ఏఎన్‌యూలో ఫార్మసీ వారోత్సవాలు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాల ఆధ్వర్యంలో 63వ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య కె. రత్న షీలామణి, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలంలు ముఖ్య అతిథులుగా మాట్లాడారు. రెక్టార్ మాట్లాడుతూ.. ఔషధాలు, వ్యాక్సిన్‌ల తయారీలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమన్నారు. రిజిస్ట్రార్ మాట్లాడుతూ... రోగాలకు మందులను తయారు చేయటంలో బయో టెక్నాలజీ, ఫార్మసీ అత్యంత ప్రాముఖ్యత వహిస్తున్నాయన్నారు. విద్యార్థులకు షార్ట్ ఫిల్మ్, క్విజ్, ఎలక్యూషన్, పోస్టర్ ప్రజంటేషన్, పిక్చర్ స్పీక్స్ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రిన్సిపల్ ఆచార్య ఎ. ప్రమీల రాణి, ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ కె.సుజన, వైద్యులు రవి శంకర్ రెడ్డి, యు.అన్నపూర్ణ, ఎ్‌స్.కె. మస్తానమ్మ, ప్రవల్లిక, పి.రవి, గాయత్రి రమ్యతోపాటు కె. విజయ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
తెనాలి కేకేఆర్ గౌతమ్ స్కూల్‌కు షోకాజ్ నోటీసు
గుంటూరు ఎడ్యుకేషన్: తెనాలిలోని కేకేఆర్ గౌతమ్ స్కూల్‌కు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక శనివారం షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఆ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న షేక్ మెహరాజ్ అనే విద్యార్థి శుక్రవారం పాఠశాల ముగిసిన అనంతరం స్టాండ్‌లో నుంచి సైకిల్ తీసుకుంటున్న సమయంలో ఐదో అంతస్తు నుంచి కిటికీ, సంబంధిత అద్దాలు మీదపడిన సంఘటనలో తలకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ప్రిన్సిపల్ తీసుకెళ్లారు. బ్రెయిన్ స్కాన్, సీటీ స్కాన్ తీయించాక చికిత్స అనంతరం ప్రమాదమేమీ లేదని వైద్యులు చెప్పినట్లు డీఈవో రేణుక తెలిపారు. ఎంఈవో ద్వారా విచారణ నివేదిక తెప్పించుకున్న డీఈవో... విద్యార్థి వైద్య ఖర్చులను యాజమాన్యమే భరించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. భద్రతాపరమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన యాజమాన్యానికి పాఠశాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలని వివరణ కోరుతూ షోకాజ్ నోటీసు జారీ చేశారు.
సీజీహెచ్‌ఎస్ రాష్ట్ర కార్యాలయ ఏర్పాటుపై వినతి
లక్ష్మీపురం: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటయ్యే ’సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సి.జి.హెచ్.ఎస్.) రాష్ట్ర కార్యాలయాన్ని విశాఖపట్నంలో కాకుండా గుంటూరు లేదా విజయవాడలో ఏర్పాటు చేయాలని సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సి.బి.ఐ.సి.) రాష్ట్ర పెన్షనర్ల సంఘం నాయకులు టి. వివేకానంద, గద్దె తిలక్‌లు కోరారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద గల సి.జి.హెచ్.ఎస్. కార్యాలయానికి శనివారం తనిఖీ నిమిత్తం వచ్చిన అడిషనల్ డైరెక్టర్ దండు పూర్ణచంద్రరావును సంఘం ప్రతినిధులు కలిశారు. సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎ.పి.లోని 26 జిల్లాలకు కేవలం ఏడు చోట్ల వెల్‌నెస్ సెంటర్లు ఉన్నాయని చెప్పారు. వీటి సంఖ్య పెంచాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు పి.కోటేశ్వరరావు, గుమ్మడి సీతారామయ్య చౌదరి, సి.జి.హెచ్.ఎస్. డాక్టర్లు టి.సీహెచ్. కోటేశ్వరరావు, డి.తుకారాం, అయేషా, సునీల్, రామారావు, మురళీ పాల్గొన్నారు.
కార్మికులకు మద్దతు
తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సలీమ్, దర్శనపు సామేల్ తెలిపారు. శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించాక వారు మాట్లాడుతూ కోర్టు తీర్పులు కార్మికులకు అనుకూలంగా ఉన్నా యాజమాన్యం స్పందించడం లేదన్నారు. మంత్రి లోకేష్ కార్మికులకు న్యాయం చేయాలన్నారు. సీఐటీయూ పట్టణ కార్యదర్శి వేముల దుర్గారావు, కాంగ్రెస్ నాయకులు పటాన్ సుభాని, కె.కృష్ణ చౌదరి, కార్మికులు స్టీవెన్, ఎ.వెంకట స్వామి, బి. సమర్పణ రావు, జి.అర్జునరావు, ఎస్‌కే ఝాన్సీ, దుర్గా భవాని, సుభాని, ఇశ్రాయేల్, ఎం. ఆశీర్వాదం, బి.అంకయ్య, రమాదేవి, నవనీతం, శారద, సారమ్మ, సామ్రాజ్యం, సాంబయ్య, సూర్య ప్రకాష్, యెహోషువా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment