టేబుల్ టెన్నిస్‌లో తెనాలి లైన్‌మెన్ రాణింపు
● ఉద్యోగం చేస్తూనే ఆటలో ప్రతిభ ● విద్యుత్ ఉద్యోగుల జాతీయ పోటీల్లో రన్నర్స్ ట్రోఫీ కై వసం
తెనాలి: టేబుల్ టెన్నిస్‌లో తెనాలికి చెందిన విద్యుత్ లైన్‌మెన్ రాణిస్తున్నారు. అందరినీ అబ్బురపరుస్తున్నారు. తెనాలికి చెందిన కొమరగిరి మహేష్ విద్యుత్ ఉద్యోగులు ఆలిండియా టెన్నిస్ టోర్నమెంటులో సత్తాచాటుతున్నారు. తొలిసారిగా ఫైనల్స్‌కు చేరిన ఆంధ్ర డబుల్స్ జట్టులో సభ్యుడయ్యారు. గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీరు కేవీఎల్‌ఎన్ మూర్తితో కలిసి మహేష్ ఈ టోర్నమెంటులో డబుల్స్ జట్టులో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించారు. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో టెన్నిస్ అకాడమీలో ఈనెల 25 వరకు జరిగిన టోర్నమెంటులో మూర్తి, మహేష్ తమ అసాధారణ ప్రతిభను చాటారు. వరుసగా ఉత్తరప్రదేశ్, కోల్‌కతా, కర్ణాటక జట్లపై విజయం సాధించి సెమీఫైనల్స్‌లో ఛత్తీస్‌ఘడ్ జట్టుతో తలపడ్డారు. ఈ పోటీలోనూ విజయం సాధించి, ఫైనల్స్‌కు చేరుకుని రన్నర్స్ స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. చివరిరోజున జరిగిన ఫైనల్స్ మ్యాచ్‌లో కేరళ జట్టుపై స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. రన్నర్స్ ట్రోఫీని అందుకున్నారు.
చిన్ననాటి నుంచి ఆసక్తి
లైన్‌మెన్ మహేష్‌కు చిన్నతనం నుంచి క్రీడలపై ఆసక్తి. విద్యుత్‌శాఖలో రెండు దశాబ్దాల క్రితం ఉద్యోగంలో చేరారు. టెన్నిస్ క్రీడపై మక్కువ అధికంగా ఉండేది. స్థానిక కొత్తపేటలోని ఆఫీసర్స్ క్లబ్‌లో టెన్నిస్ కోర్టు ఉండటం కలిసొచ్చింది. ఆఫీసర్స్ క్లబ్‌లోని కోర్టులో టెన్నిస్ సాధన చేశారు. డిపార్టుమెంటు పోటీలే కాకుండా బయటి అసోసియేషన్లు నిర్వహించే పోటీల్లోనూ పాల్గొంటూ వస్తున్నారు. అనేక పతకాలు, జ్ఞాపికలను సాధించారు. విద్యుత్ ఉద్యోగులకు గత నెలలో నిర్వహించిన పోటీల్లో సింగిల్స్, డబుల్స్‌లోనూ మంచి విజయాలను నమోదుచేశారు. తనను ఆదరించి ప్రోత్సహిస్తున్న అధికారులకు, కుటుంబసభ్యుల కారణంగానే ఈ విజయాలను సాధిస్తున్నట్టు మహేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment