పొదుపు సంఘాలకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు సిద్ధం
తాడేపల్లిరూరల్: బ్యాంకులు పొదుపు సంఘాలకు అవసరమైన రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఎవరికీ ఎలాంటి కమీషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్వయం సహాయక సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ సీనియర్ మేనేజర్ గౌతమ్ స్పష్టం చేశారు. బుధవారం వడ్డేశ్వరంలో స్వయం సహాయక సంఘాల రాష్ట్ర సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో సీహెచ్ రమణి అధ్యక్షతన డ్వాక్రా గూపు సభ్యులకు సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌతమ్ మాట్లాడుతూ పొదుపు సంఘాల నుంచి రుణాల మంజూరుకు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. వీఓఏల సంతకాలు లేకపోతే అవసరమైన డాక్యుమెంటేషన్ వారు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. లోన్ సమయంలో బలవంతపు ఇన్సూరెన్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్, కమీషన్ల వసూలు నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు పొదుపు సొమ్ము అంతర్గత రుణాలు తీసుకోవడానికి ఆటంకాలు సృష్టిస్తున్నారని, రుణ మంజూరుకు నెలల సమయం పడుతోందని గౌతమ్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన సమస్యలపై ఉన్నతాధికారులతో చర్చిస్తామని చెప్పారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ డ్వాక్రా గ్రూపుల్లో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రుణాల ప్రాసెసింగ్ చార్జీలు రద్దు చేయాలని కోరారు. ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలు ఐక్యంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీనివాస కుమారి, ఐద్వా రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ శ్రీదేవి, పి. పూర్ణ, వై. సత్యవతి, బి. పద్మ, జి. అమల పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment