ధాన్యం కొనుగోలులో సమస్యలు పరిష్కరించాలి
ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు
తాడేపల్లిరూరల్ : ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాగంటి హరిబాబు, సంఘం నాయకులు మంత్రి నాదెండ్ల మనోహర్‌కు విన్నవించారు. బుధవారం తాడేపల్లిలో పర్యటిస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను వారు కలిశారు. ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతు వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని, రైతు వద్ద ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ అవుతుందని చెప్పారని, కానీ ఆచరణలో జరగడం లేదని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గోనె సంచులు లేవని, తేమశాతం రైతు సేవా కేంద్రాల వద్ద ఫైనల్ చేసి ధర నిర్ణయించాలని చెప్పారు. ఇంకా పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ 23 శాతం తేమ ఉన్నా ధాన్యం సేకరించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. చిర్రావూరు గ్రామంలో ఉన్న ధాన్యాన్ని కాటావేసి లోడింగ్ వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు 24 గంటలలో నగదు జమయ్యేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో తాడేపల్లి మండల వ్యవసాయ అధికారి ఎ.శ్రీనివాస్, వ్యవసాయ అధికారులు, ఏపీ కౌలు రైతు సంఘం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, నాయకులు పల్లపాటి సుబ్బారావు, రైతు సంఘం నాయకులు బొప్పన గోపాలరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్య క్షులు పరిమిశెట్టి శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment