మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు
జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు
తెనాలి: జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసిన రైతుసేవా కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయనున్నట్టు జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు చెప్పారు. రైతులు తీసుకొచ్చిన 17 శాతం తేమతో ఉన్న 75 కిలోల బస్తాను రూ.1,740 చొప్పున కొనుగోలు చేస్తామని తెలిపారు. సోమసుందరపాలెంలో బాపట్ల వరి పరిశోధన స్థానం నుంచి తెచ్చిన బీపీటీ–3082 వరి రకం సాగు చేసిన పొలాన్ని శాస్త్రవేత్తలు డాక్టర్ వి.కృష్ణవేణి, డాక్టర్ టి.హరిత సందర్శించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రబీ పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియాన్ని కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా చెల్లించాలని సూచించారు. హార్వెస్టింగ్ యంత్రాలతో పంటను నూర్చిన తర్వాత, మిగిలిన గడ్డిని తగులబెట్టవద్దని రైతులతో చెప్పారు. మల్చర్‌తో ముక్కలు చేసి భూమిలో కలపాలని పేర్కొన్నారు. బాపట్ల వరి పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వి.కృష్ణవేణి మాట్లాడుతూ సోమసుందరపాలెం గ్రామంలోని పి.మధుసూనదరావు చేలో వేసిన బీపీటీ–3082 రకం మినీకిట్ రూపంలో ఉన్నదని చెప్పారు. మధ్యస్థ రకమని, కాలవ్యవధి 135 రోజులుగా ఉంటుందని తెలిపారు. సన్న గింజ ఉంటుందని, దోమపోటు, అగ్గితెగులును తట్టుకుంటుందని చెప్పారు. కంకి పొడవుగా ఉండి, 250–300 గింజలు ఉంటున్నాయని, తినడానికి కూడా అనువుగా ఉంటుందని వివరించారు. వీరితో మండల వ్యవసాయ అధికారి జి.ప్రేమసాగర్ కూడా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment