పెళ్లి కుదిరితే మొక్కాల్సిందే!
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరం నడిబొడ్డున సీతమ్మ వారి పాదాలు దశాబ్దాలుగా పూజలందుకుంటున్నాయి. కొరిటెపాడు మెయిన్‌రోడ్డులో హరిహర మహల్ థియేటర్ ఎదుట రోడ్డు పక్కన రావి చెట్టు వద్ద వెలిసిన సీతమ్మ పాదాలు బ్రిటీషు కాలానికి పూర్వం నుంచి ఉన్నాయి. ప్రస్తుతం గుంటూరు నగరంలోని ఒక ముఖ్యమైన ప్రాంతంగా ఉన్న కొరిటెపాడు అప్పట్లో ఒక గ్రామంగా ఉండేది. ప్రస్తుత హరిహర మహల్ ప్రాంతం కొన్ని దశాబ్దాలకు పూర్వం కొరిటెపాడు గ్రామ పొలిమేర. సీతమ్మ వారి పాదాలను గ్రామదేవతగా భక్తులు పూజిస్తున్నారు. చరిత్రకు అందని కాలంలోనే ఇక్కడ సీతమ్మ వారి పాదాలు వెలిసినట్లు స్థానికులు చెబుతున్నారు. రావిచెట్టు మొదట్లో ఉన్న సీతమ్మ పాదాలు కాలక్రమేణ నగరం విస్తరించడంతోపాటు రహదారి నిర్మాణ పనులతో రోడ్డును ఆనుకుని ఉన్నాయి. గతంలో ఎటువంటి రక్షణ లేని పరిస్థితుల్లో కొంత కాలం క్రితం చుట్టూ గోడను నిర్మించారు. కొరిటెపాడుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో వివాహం నిశ్చయం అయిన ఆడ పిల్లలను వెంట పెట్టుకుని కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి, సీతమ్మ పాదాలకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అలా చేస్తే శుభప్రదం అని నమ్ముతారు. ఇక్కడి రావిచెట్టు దశాబ్దాలుగా అలానే ఉంది. రహదారి విస్తరణ పనుల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం సైతం రావిచెట్టును కదిలించే ప్రయత్నం చేయకుండా దాని పవిత్రతను కాపాడుతున్నారు. రోడ్డును ఆనుకుని ఉన్న సీతమ్మపాదాల చెంత పలువురు సీతారాములు, లక్ష్మణ, ఆంజనేయస్వామి తదితర దేవతా విగ్రహాలను తెచ్చి పెడుతున్నారు. దశాబ్దాల ప్రాశస్త్యం గల సీతమ్మపాదాలను పరిరక్షించాల్సిన అవసరముంది.
నేటికీ కొరిటెపాడులో పూజలు అందుకుంటున్న సీతమ్మ పాదాలు బ్రిటీషు కాలానికి పూర్వం నుంచే ఇక్కడ ఉన్నట్లు ప్రచారం గతంలో ఈ ప్రాంతం కొరిటెపాడు గ్రామ పొలిమేర
Comments
Please login to add a commentAdd a comment