కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు అక్టోబర్ నెల వేతనాలు ఇంతవరకు అందలేదు. గతంలో వేతనాల చెల్లింపు సకాలంలో జరిగేవి. ఎప్పుడూ లేని విధంగా అక్టోబర్ నెల జీతాలు నవంబర్ నెల పూర్తి కావస్తున్నా అతీగతీ లేకపోవడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మార్కెట్ కమిటీ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. గుంటూరు జిల్లాలో 8 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఉద్యోగులు ప్రతి నెలా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలపై ఒక్క శాతం ఫీజు వసూలు చేస్తున్నారు. ప్రతి కమిటీ రూ.లక్షల్లో ఇలా వసూలు చేస్తుంది. అదే రోజు సీఎఫ్‌ఎంఎస్ ద్వారా ప్రభుత్వానికి ఈ మొత్తం చేరుతుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని ఇచ్చే వాటిలో మార్కెట్ కమిటీలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత వీరు వేతనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. మరో రెండు రోజులు గడిస్తే నవంబర్ నెల వేతనాలు కూడా ఇవ్వాలి. కానీ గత నెల జీతం రాకపోవడంతో ఉద్యోగులు అప్పులు చేయాల్సి వస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన పీడీ ఖాతా కూడా ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది. 2014 –19 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. నాటి నుంచి మార్కెట్ కమిటీ ఉద్యోగులు సకాలంలో వేతనాలు పొందని పరిస్థితి ఏర్పడింది. మొదటిసారిగా నెల అవుతున్నా జీతాలు రాలేదు. ఉద్యోగులకు సీఎఫ్‌ఎంఎస్ గ్రీన్ చానల్ ద్వారా చెల్లిస్తారు. నిధులు లేకపోవడం వల్ల వేతనాలు పొందలేకపోతున్నారు.
అక్టోబర్ నెల వేతనాలు ఇంత వరకు అందని వైనం తొలి సారిగా మార్కెట్ కమిటీ ఉద్యోగులకు ఈ దుస్థితి
Comments
Please login to add a commentAdd a comment