వజ్రబాబు సోదరికి న్యాయం చేయాలి
ఎస్పీని కలిసి వినతిపత్రం అందించిన వైఎస్సార్ సీపీ నేతలు
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): వైఎస్సార్ సీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త, జీఎంసీ డెప్యూటీ మేయర్ బాలవజ్రబాబు (డైమండ్ బాబు) సోదరికి న్యాయం చేయాలని, ఆమె ఇంటి నుంచి బయట పాడేసిన సామాన్లను తిరిగి ఇంటిలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు కోరారు. ఆదివారం గుంటూరు విద్యానగర్‌లోని డైమండ్‌బాబు సోదరి ఇంటి విషయమై తలెత్తిన వివాదంపై సోమవారం రాత్రి ఎస్పీ సతీష్‌కుమార్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ ఆదివారం జరిగిన వివాదం పూర్తిగా సివిల్ వివాదమని పేర్కొన్నారు. వజ్రబాబు సోదరి, వారి కుటుంబ సభ్యులు చాన్నాళ్లుగా ఆ ఇంట్లో నివసిస్తున్నారని చెప్పారు. ఓనర్‌షిప్ విషయమై న్యాయస్థానంలో కొంత కాలంగా వివాదం నడుస్తోందని వివరించారు. ఆదివారం రాత్రి హఠాత్తుగా కిరణ్ అనే వ్యక్తి, పలువురితో కలిసి వచ్చి డైమండ్‌బాబు సోదరిని, ఇంట్లోని సామాన్లను రోడ్డుపై విసిరేసి, ఇంటిని ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఈ క్రమంలో డైమండ్ బాబు వెళ్తే పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన సెల్‌ఫోన్ లాగేసుకుని, 41 నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. కిరణ్ అనే వ్యక్తి డైమండ్‌బాబుపై, వారి కుటుంబ సభ్యులపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే సివిల్ విదాదాల్లో పోలీసుల జోక్యం ఉండరాదనే విషయమై ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. వజ్రబాబు సోదరిని, సామాన్లను ఇంట్లోకి తీసుకెళ్లడంపై చర్చించామని వివరించారు. ఎస్పీ సానుకూలంగా స్పందించారని, సామాన్లను లోనికి తరలించే విషయమై పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పారని అంబటి వివరించారు. గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంటు పరిశీల కులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, మేయర్ కావటి మనోహ ర్, వైఎస్సార్ సీపీ తూర్పు సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల రాజనారాయణ, బాలవజ్రబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment