ప్రజల పక్షాన పోరుబాట
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రజలపై విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ సీపీ పోరుబావుటా ఎగరేసింది. ఈ నెల 27న జిల్లా వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిరసనకు సంబంధించిన పోస్టర్‌లను పార్టీ నేతలు సోమవారం ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు, పల్నాడు జిల్లాల పార్లమెంట్ జిల్లాల పరిశీలకులు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్‌నాయుడు, డెప్యూటీ మేయర్, నగర అధ్యక్షుడు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్), పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏరుదాటాక తెప్ప తగలేసే చందంగా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించటం కొత్తేమీ కాదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలను తగ్గిస్తామని బాబు చెప్పారని, అసలు పెంచబోమని కూడా చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలు అయిపోయిన తరువాత రాష్ట్ర ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నారని ధ్వజమెత్తారు. విద్యుత్ బిల్లులతో ప్రజలపై బాదుడు కార్యక్రమం ప్రారంభించారని మండిపడ్డారు. నవంబర్ నెలలో రూ.6,072 కోట్లు, డిసెంబర్ నెలలో రూ.9,412 కోట్లు కలిపి మొత్తం రూ.15,484 కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. అందుకే ప్రజల పక్షాన వైఎస్సార్ సీపీ చేపడుతున్న పోరుబాట నిరసన కార్యక్రమానికి వినియోగదారులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిరసన తెలియజేయటంతోపాటు, అధికారులకు వినతిపత్రాలు అందించనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు నిమ్మ కాయల రాజనారాయణ, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బైరెడ్డి రవీంద్రారెడ్డి, కార్పొరేటర్‌లు ఈచంపాటి వెంకటకృష్ణ (ఆచారి), రోషన్ పార్టీ నేతలు, అనుబంధ విభాగాల నేతలు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్‌చార్జీల పెంపుపై ఆందోళన 27న విద్యుత్ కార్యాలయాల ఎదుట నిరసన పోస్టర్‌ను ఆవిష్కరించిన వైఎస్సార్ సీపీ నేతలు ప్రజలపై రూ.15,484 కోట్లు భారం మోపిన కూటమి సర్కారు ధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు
Comments
Please login to add a commentAdd a comment