చీకటి మాటున ఇసుక దోపిడీ..!
గుంటూరు జిల్లాలో ఇసుక దోపిడీ ఆగడం లేదు. పగలు మనుషులతో తవ్వకాలు సాగిస్తూ.. రాత్రి కాగానే యంత్రాలతో ఇసుకను తోడేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రాతినిధ్యం వహిస్తున్న తెనాలి పరిధి కొల్లిపర మండలంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ తోడేస్తున్నారు. నదిలో యంత్రాలతో ఇసుకను తీయటం, సాయంత్రం ఆరు గంటల తర్వాత తవ్వకాలను సుప్రీంకోర్టు నిషేధించింది. అక్రమార్కులు ఆ నిషేధాలను బేఖాతర్ చేస్తున్నారు. రేషన్ బియ్యంపై రాష్ట్రమంతా తనిఖీలు చేస్తున్న నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి తెనాలిలోని పీఎండీ వాహనాలను పలుసార్లు పరిశీలించారు. రైతుబజారులోని తగ్గింపు ధరల బియ్యం దుకాణాల్లోనూ ఆకస్మికంగా తనిఖీ చేసి, హడలగొట్టారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీని మాత్రం పట్టించుకోవటం లేదు.
● రేషన్ బియ్యం తరలింపు అంటూ నానా హంగామా ● మరోవైపు కృష్ణానది నుంచి యథేచ్ఛగా తరలిపోతున్న ఇసుక ● పగలు మనుషులతో.. రాత్రి భారీ యంత్రాలతో తవ్వకాలు ● ఉచితం పేరుతో కొల్లగొడుతున్న కూటమి నాయకులు
మంత్రి నాదెండ్ల ఇలాకాలో ఆగని ఇసుక అక్రమ రవాణా
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కొల్లిపర మండలంలో మున్నంగి, బొమ్మువానిపాలెం–14, బొమ్మువానిపాలెం–15లో ఇసుక రీచ్‌లు నడుస్తున్నాయి. వీటిని ప్రైవేటు కంపెనీలు దక్కించుకున్నాయి. కేవలం కూలీల ద్వారా నదిలో ఇసుకను తవ్వించి, సమీపంలోని డంపింగ్ ప్రదేశంలోకి ట్రాక్టర్లలో చేర్చుతున్నారు. అదంతా మొక్కుబడి తంతుగా చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. రెండు నుంచి నాలుగు ఎక్సవేటర్లు నేరుగా నదిలోకి వెళుతున్నాయి. రాత్రంతా ఇసుకను తోడేస్తున్నారు. యంత్రాలతోనే 30 టన్నుల భారీ వాహనాల్లోకి లోడు చేస్తున్నారు. రాత్రి పూట లోడుతో వెళ్లే వాహనాలు వెళుతుంటే, మరి కొన్ని నది సమీపంలోని డంపింగ్ ప్రదేశంలో అన్‌లోడు చేస్తున్నాయి. ఒకరాత్రి గడిచేసరికి డంపింగ్‌లో ఉన్న ఇసుక మూడు, నాలుగు రెట్లు పెరిగిపోతోంది. పగటిపూట దర్జాగా ఆ ఇసుకను యంత్రాలతోనే వాహనాల్లోకి లోడు చేసి తాపీగా నిర్ణీత ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. పగటి పూట వెళ్లే వాహనాలకే వే–బిల్లులు వ్యవహారం ఉంటుంది. రాత్రి పూట ఏ ఆధారం లేకుండా చూస్తున్నారు. గత నెలరోజులుగా జరుగుతున్న తతంగమిది.
ఏ లోడైనా ఒకటే వే బిల్లు..
ప్రభుత్వం నిబంధనలు మేరకు టన్నుకు రూ.250 తీసుకోవాలి. నిర్వాహకులు లోడింగ్ వద్ద ఎటువంటి వేబ్రిడ్జి కాటా లేకుండా ఎక్స్‌వేటరు మిషన్‌కు ఉన్న బకెట్‌తోనే కొలతలు చేస్తున్నారు. 18 టన్నుల లారీకి 11 బకెట్‌లో లోడు చేసి రూ.6,000 వసూలు చేస్తున్నారు. 24 టన్నుల లారీకి 13 బకెట్‌లు పోసి రూ.9,000 తీసుకుంటున్నారు. అదే వాహనంలో మరింత ఇసుక కోరుకున్న వారికి అదనంగా రూ.500 తీసుకుని లోడు చేస్తున్నారు. ఇసుక ఎంత లోడు చేసినా వే బిల్లు మాత్రం 18, 24 టన్నులకు మాత్రమే ఇస్తున్నారు. ఇదంతా పగటి పూట అధికారికంగా జరుగుతున్న దోపిడీ. రాత్రి 10 గంటల తర్వాత నేరుగా నదిలో ఇసుక లోడింగ్ చేసేటప్పుడు మాత్రం 18 టన్నుల లారీకి రూ.7,000, 24 టన్నుల లారీకి రూ.10,000 వసూలు చేస్తున్నారు. కొల్లిపర మండలంలోని మూడు ఇసుక రీచ్‌లు నదిలో సుమారు 2 కి.మీ. లోపలకు ఉన్నాయి. రాత్రివేళల్లో ఇక్కడ యంత్రాలతో ఇసుక తోడేస్తున్నారు. అపరిచిత వ్యక్తులు ఎవరూ రాకుండా నిర్వాహకులు అడుగడుగునా కాపలా ఉంచి మరీ పని కానిస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరు అటుగా వెళ్లినా తరిమేస్తున్నారు. ఎవరూ అటు వెళ్లే సాహసం కూడా చేయటం లేదు. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
నిబంధనలకు ‘మంగళ’ం
మంగళగిరి నియోజకవర్గంలోని గుండిమెడలో కూడా ఇదే తంతు నడుస్తోంది. గ్రామస్థాయి నాయకులు ఉచిత ఇసుక పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో తవ్వకాలు జరుపుతున్నారు. ప్రభుత్వం కృష్ణానదికి మూడు కిలోమీటర్ల లోపు ఉన్న ప్రాంతాల వారు సచివాలయం అనుమతితో ఇసుకను ఉచితంగా తీసుకెళ్లవచ్చని సూచించింది. కానీ 30 కిలోమీటర్ల వరకు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసేస్తున్నారు. జిల్లాలోని రాయపూడి, ఉద్దండరాయపాలెం, ప్రాతూరు, చిర్రావూరు, రామచంద్రాపురం, కొండూరు, తెనాలి నియోజవర్గంలోని పలు ఇసుక రీచ్‌ల నుంచి ఉచిత ఇసుక పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. కూటమి నేతల ధనదాహానికి కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా 10 మీటర్ల లోతు పెట్టి మరీ ఈ ఇసుక తవ్వకాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో భూగర్భ జలాలు అడుగంటడమే కాకుండా పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవే కాకుండా జిల్లాలో 17 ఎకరాల పట్టా భూముల్లో, 4.93 హెక్టార్ల ప్రభుత్వ భూముల్లో ఇసుక తవ్వకాలకు జిల్లా యంత్రాంగం అనుమతులు జారీ చేసింది. మరో 70 ఎకరాల్లో ఇసుక తవ్వకాల కోసం వచ్చిన దరఖాస్తులకు కూడా త్వరలో ఆమోద ముద్ర వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment