పెద్ద టాస్క్!
భూ సేకరణే
సాక్షి, వరంగల్ :
అదిగో...ఇదిగో అంటూ దాదాపు ఏడేళ్ల నుంచి ప్రచారంలో ఉన్న గ్రేటర్ వరంగల్ పరిధి మామునూరు విమానాశ్రయం ఈసారి కచ్చితంగా ముందుకు తీసుకెళుతున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సంకేతాలిస్తున్న నేపథ్యంలో ఈసారి కూడా హడావుడి చర్చేనా.. లేక ముందుకెళ్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల లోపు మరో వాణిజ్య విమానాశ్రయం ఏర్పాటు వద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో జీఎంఆర్ సంస్థకు ఉన్న ఒప్పందం తాజాగా కొలిక్కి వచ్చినా.. భూ సేకరణ పెద్ద టాస్క్‌గా మారింది.
పక్కాగా దృష్టి సారిస్తేనే..
చిన్న నగరాలను రాష్ట్ర, దేశ రాజధానులతో కలిపేందుకు కేంద్రం ఉడాన్ (ఉడో దేశ్ కీ ఆమ్ నాగరిక్) పథకం కింద మామునూరు విమానాశ్రయాన్ని 2022 సెప్టెంబర్‌లో ఎంపిక చేసింది. వరంగల్ శివారులోని మామునూరులో నిజాం కాలంనాటి ఎయిర్ స్ట్రిప్ అందుబాటులో ఉండేది. అక్కడ 1,400 మీటర్ల పొడవైన రన్ వే, గ్లైడర్స్ దిగేందుకు మరో చిన్న రన్ వే ఉంది. దశాబ్దాలుగా వినియోగంలో లేకపోవడంతో బాగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఆ పాత ఎయిర్ స్ట్రిప్‌నకు చెందిన 696 ఎకరాల భూమి ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆధీనంలో ఉంది. రన్ వే విస్తరణ కోసం అదనంగా అవసరమయ్యే 253 ఎకరాల భూసేకరణ జరగాలంటే ప్రజాప్రతినిధులతోపాటు రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలి. భూసేకరణ పూర్తయితే 150 నుంచి 186 మంది ప్రయాణించేలా వీలున్న 37.6 మీటర్ల (123 ఫీట్ల) పొడవున్న ఏ 320, బీ–737 విమానాలు రాకపోకలు సాగించనున్నాయి.
రైతులను ఒప్పించేనా..
విమానాశ్రయం ఏర్పాటుకు 253 ఎకరాలు ఇవ్వాల్సిన గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి, మామునూరు రైతులను ఒప్పించడమే ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారింది. ఇక్కడ ప్రభుత్వ విలువ ప్రకారం ఎకరానికి సమారు రూ.10 నుంచి రూ.15 లక్షలుంటే...బహిరంగ మార్కెట్‌లో మాత్రం రూ.కోటి నుంచి రూ.రెండు కోట్లు పలుకుతోంది. గతంలో రన్ వే విస్తరణ కోసం రెవెన్యూ అధికారులు సర్వే చేసిన సమయంలో రైతులు అడ్డుకొని గొడవ చేసిన సందర్భాలున్నాయి. ఇక్కడ భూమి కోల్పోతున్న 233 మంది రైతులకు మామునూరులోని పశు సంవర్థక శాఖకు చెందిన 253 ఎకరాలు బదలాయిస్తామంటూ గతంలో చర్చలు జరిగినా అందుకు రైతులు ససేమిరా అన్నారు. దీంతో ఏఏఐకు భూముల బదలాయింపు ప్రక్రియ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది.
మామునూరు విమానాశ్రయం ఈసారైనా ముందుకెళ్లేనా..?
రంగశాయిపేట జంక్షన్ నుంచి నక్కలపల్లి, గుంటూరుపల్లి, కాపులకనిపర్తి, తీగరాజుపల్లి, నెక్కొండకు వెళ్లే ప్రధాన రహదారి రన్ వే విస్తరణలో మాయమవుతోంది. అలాగే గాడిపల్లి నుంచి గుంటూరుపల్లికి వెళ్లే రహదారి బంద్ కానుంది. రన్ వే విస్తరణ అయితే నెక్కొండ నుంచి వచ్చే వాహనాలను కాపులకనిపర్తి దగ్గరి నుంచి గాడిపల్లి, దూపకుంట మీదుగా శంభునిపేట జంక్షన్‌కు మళ్లించే వీలుంది.
ఏళ్లుగా అదిగో, ఇదిగో అంటూ కాలయాపన
తాజాగా వరుస సమీక్షలతో
మంత్రుల హడావుడి
గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామస్తులను ఒప్పిస్తేనే సాధ్యం
బహిరంగ మార్కెట్ రేటు
చెల్లించాలంటున్న రైతులు
Comments
Please login to add a commentAdd a comment