వైద్యారోగ్యశాఖలో అక్రమాలకు తావులేదు
ఎంజీఎం : వైద్యారోగ్యశాఖలో ఎలాంటి అక్రమాలకు, అవినీతికి తావు లేకుండా పారదర్శకమైన పాలన సాగిస్తామని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య స్పష్టం చేశారు. ఎన్‌హెచ్‌ఎంలో ఓ అధికారి లీలపై
‘నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం’ శీర్షికన సాక్షిలో బుధవారం ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. నకిలీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం పొందాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రోగ్రాం అధికారికి షోకాజ్ నోటీసులు అందిస్తామన్నారు. నోటీసులకు స్పందించకపోతే కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తామని డీఎంహెచ్‌ఓ స్పష్టం చేశారు. జిల్లా వైద్యారోగ్యశాఖలో 17 పీహెచ్‌సీలు, 7 యూపీహెచ్‌సీల్లో 106 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రా(సబ్‌సెంటర్)ల ద్వారా జిల్లా ప్రజలకు వైద్యసేవలందిస్తున్నట్లు తెలిపారు. 74 ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్న క్రమంలో ప్రభుత్వం రెండేళ్ల క్రితం వీటి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందులో 21 భవనాలు పూర్తికాగా, మిగతా 53 భవనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గత అధికారులు కొంతమంది సిబ్బందిని డిప్యుటేషన్‌లపై విధులు కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేశారని, అవసరంలేని కేంద్రాల్లో డిప్యుటేషన్లు పొందిన ఉద్యోగులను గుర్తించి రద్దు చేస్తామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
నకిలీ సర్టిఫికెట్ ప్రోగ్రాం అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తా
హనుమకొండ డీఎంహెచ్‌ఓ
డాక్టర్ అప్పయ్య
Comments
Please login to add a commentAdd a comment