సాక్షి, సిటీబ్యూరో: ప్రజలందరికి మెరుగైన వైద్య సేవలందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైద్య ఆరోగ్య రంగానికి చెందిన పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. క్రై, ఎఫోర్ట్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు ‘అందరికీ ఆరోగ్యం‘ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మారుమూల ఆదివాసీ ప్రాంతాలలో వైద్య సేవలు అందక అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేయాలని, పేదవారికి వైద్య సేవలు అందించడానికి మరింత కృషి చేయాలని ఆయన సూచించారు. డాక్టర్ వీణ శత్రుజ్ఞ మాట్లాడుతూ పౌష్టికాహార లోపం వల్ల ఎదుగుదలలో మించిన లోపాలు వస్తున్నాయని, మారుమూల ప్రాంతాల్లో ప్రత్యేకంగా కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ ఎల్. కందారే మాట్లాడుతూ తాగునీరు, పౌష్టికాహారం లోపం వల్ల నల్గొండ వంటి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లో పిల్లల ఎముకల ఎదుగుదల సరిగ్గా ఉండడం లేదన్నారు. కిడ్నీ, న్యూరోలాజికల్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. అమూల్య నిధి మాట్లాడుతూ ఉత్తమ వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకు అందించాల్సిన అవసరం ఉందని సూచించారు. క్రై ప్రతినిధి పీటర్ సునీల్ బాబు మాట్లాడుతూ అందరికీ వైద్య సేవలు అందించేందుకు ధనిక, పేద వర్గాల మధ్య తారతమ్యాలను తొలగించుకోవాలని అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాల క్రై ౖ ప్రతినిధి బడుగు చెన్నయ్య అధ్యక్షత వహించిన కార్యక్రమంలో లక్ష్మణరావు, కె.రమేష్, హిమబిందు, డాక్టర్ కంచుకట్ల సుభాష్, కొమ్ము తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment