జెమ్‌కిరువైపులా కిడ్నీ దాత డెబ్బీ, గ్రహీత మైలాన్(ఎడమ నుంచి కుడికి)
వాషింగ్టన్/ఫ్లోరిడా: విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళకు అతడి మాజీ భార్యపై ఎక్కడో ఓ చోట కాస్త అసహనం, కోపం, అనుమానం ఉంటాయి. తన భర్త మాజీ భార్యను మళ్లీ కలుస్తున్నాడేమో.. వారిద్దరు మాట్లాడుకుంటున్నారేమో అనే అనుమానం సహజం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే కథనం ఇందుకు పూర్తి విరుద్ధం. మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ వివాహం అయిన రెండు రోజులకే తన భర్త మాజీ భార్యకు కిడ్నీ దానం చేసి పెద్ద మనసు చాటుకుంది. ఇప్పుడు తామిద్దరం కిడ్నీ సిస్టర్స్ అయ్యాం అని చెప్తోంది. ఆ వివరాలు..
ఫ్లోరిడాకు చెందిన జిమ్, మైలాన్ మెర్తే దాదాపు రెండు దశాబ్దాల క్రితం విడాకులు తీసుకున్నారు. అయినప్పటికి పిల్లలను కలిసి పెంచడంతో వారిద్దరు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక భార్య నుంచి విడిపోయిన తర్వాత జిమ్‌కు డెబ్బీ నీల్-స్ట్రిక్‌ల్యాండ్‌తో పరిచయం ఏర్పడింది. గత పదేళ్లుగా వారు డేటింగ్ చేస్తున్నారు. గత ఏడాది నవంవర్ 22న జిమ్, డెబ్బీ వివాహం చేసుకున్నారు.
ఇక జిమ్ మాజీ భార్య మైలాన్(59) గత కొన్నేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో ఆమె కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కేవలం 8 శాతం పని చేయడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. మైలాన్‌కు కిడ్నీ దానం చేయడానికి ఆమె సోదరుడు ముందుకు వచ్చాడు. కానీ మ్యాచ్ కాలేదు. అప్పటికి కేవలం రెండు రోజుల ముందే జిమ్, డెబ్బీల వివాహం జరిగింది.
మైలాన్ పరిస్థితి తెలుసుకున్న డెబ్బీ ఆమెకు తన కిడ్నీ దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఈ ఇద్దరు మహిళలకు కేవలం ముఖ పరిచయం మాత్రమే. వారి మధ్య పెద్దగా స్నేహం కూడా లేదు. ఇక మైలేన్ ఆస్పత్రిలో చేరే నాటికి ఆమె కుమార్తె గర్భవతి. ఇలాంటి సమయంలో మైలాన్ తన కుమార్తె దగ్గర లేదు అనే ఊహే డెబ్బీకి నచ్చలేదు. ఆ పరిస్థితిని మార్చాలని భావించింది. గతంలో తన సోదరుడు కూడా ఇలానే ఊపిరితిత్తుల మార్పిడి కోసం ఎదురు చూస్తూ.. డెబ్బీ కళ్లముందే ప్రాణాలు విడిచాడు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో డెబ్బీకి తెలుసు. అందుకే తన కిడ్నీ దానం చేయాలని భావించింది.
ఇక డాక్టర్లు డెబ్బీకి రక్తం, కణజాల టెస్ట్ చేశారు. ఈ రెండు మ్యాచ్ అయ్యాక అత్యంత క్లిష్టమైన మరో టెస్ట్ చేశారు. ఈ పరీక్షలో భాగంగా పైప్ ద్వారా 24 గంటల పాటు డెబ్బీ మూత్రాన్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేశారు. అన్ని మ్యాచ్ కావడంతో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్‌కు సిద్ధం చేశారు వైద్యులు. జిమ్, డెబ్బీల వివాహం జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే ఈ సర్జరీ చేశారు.
ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. స్పృహలోకి వచ్చాక మైలాన్, డెబ్బీ ఒకరి యోగ క్షేమాల గురించి ఒకరు ఆరా తీశారు. ఆ తర్వాత మైలాన్ తన కుమార్తె ఇంటికి.. డెబ్బీ జిమ్ ఇంటికి వచ్చారు. ఇకపైన జీవితాంతం తామిద్దరం కిడ్నీ సిస్టర్స్‌గా ఉంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment