కరడుగట్టిన నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రత్యేక రైలులో మిత్రదేశం రష్యా చేరుకున్నారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కిమ్ భేటీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నేడో రేపో చర్చలు జరగనున్నాయి. అగ్రరాజ్యం అమెరికాపై ఉన్న ఉమ్మడి శత్రుత్వం వల్ల రష్యా–ఉత్తర కొరియా సన్నిహితంగా మారాయని చెప్పొచ్చు.
రెండు దేశాలూ అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రమైన ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. రష్యా, ఉత్తర కొరియాలను దుష్ట దేశాలుగా అమెరికా అభివర్ణిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా పట్ల కొంత ఉదారంగానే వ్యవహరించారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం కిమ్ పట్ల కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలో కిమ్–పుతిన్ తాజా సమావేశంపై ప్రపంచమంతటా ఆసక్తి నెలకొంది. ఈ భేటీ వల్ల ప్రపంచ భౌగోళిక–రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఆయుధమే కీలకం..
పుతిన్–కిమ్ భేటీతో ఎవరికి ఎంత లాభం? అనేదానిపై చర్చ మొదలైంది. కిమ్ రాజ్యంలో భారీస్థాయిలో ఆయుధ పరిశ్రమ వర్థిల్లుతోంది. ఆయుధాల ఉత్పత్తి సామర్థ్యం అధికంగా ఉంది. మరోవైపు ఉక్రెయిన్‌పై సుదీర్ఘ కాలంగా యుద్ధం కొనసాగిస్తున్న రష్యా వద్ద ఆయుధ నిల్వలు నిండుకున్నాయి. పైగా ఉక్రెయిన్ నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అమెరికా సహా పశ్చిమ దేశాలు ఇస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ సైన్యం రష్యాపై విరుచుకుపడుతోంది.
రష్యాకు ఇతర దేశాల నుంచి ఇప్పటికిప్పుడు ఆయుధాలు అందే పరిస్థితి లేదు. అందుకే ఉత్తర కొరియా నుంచి ఆయుధాల సేకరణపై పుతిన్ దృష్టి పెట్టారు. ఉత్తర కొరియా నుంచి రష్యాకు ఆయుధాల ఎగుమతిపై ఇరుదేశాల నడుమ ఇప్పటికే ఫలవంతమైన చర్చలు జరిగినట్లు అమెరికా అనుమానిస్తోంది. తుది ఒప్పందం కోసమే కిమ్ రష్యాకు వెళ్లినట్లు చెబుతోంది. అయితే, దీనిపై రష్యా ఇప్పటిదాకా అధికారికంగా స్పందించలేదు.
ఆయుధాల కొనుగోలును నిర్ధారించలేదు. కానీ, రక్షణ రంగంలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని రష్యా, ఉత్తర కొరియా తీర్మానించుకున్నాయని చెప్పడానికి ఎన్నో దృష్టాంతాలు కనిపిస్తున్నాయి. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు ఈ ఏడాది జూలైలో ఉత్తర కొరియాలో పర్యటించారు. అక్కడ ఆయుధాల ప్రదర్శనను తిలకించారు. ఆయుధాల ఫ్యాక్టరీలను సైతం సందర్శించినట్లు వార్తలొచ్చాయి. ఉత్తర కొరియాతో కలిసి ఉమ్మడిగా సైనిక విన్యాసాలు చేపడతామని సెర్గీ ప్రకటించారు. అప్పట్లో సెర్గీకి కిమ్ జోంగ్ ఉన్ ‘టూర్ గైడ్’గా పనిచేశారు. దగ్గరుండి తమ ఆయుధాలను చూపించారు.
సంతకాన్ని రద్దు చేసుకుంటే!
ఉత్తరకొరియా నుంచి ఆయుధాలు చేతికి అందిన తర్వాత ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందని పుతిన్ సంకేతాలిస్తున్నారు. అమెరికా కనుసన్నల్లో నడస్తున్న ప్రపంచ క్రమం(వరల్డ్ ఆర్డర్) మారుతుందని అంటున్నారు. తమ లక్ష్య సాధనకు ఉత్తర కొరియాతో సైనిక సహకారం సైతం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, అణ్వస్త్ర ప్రయోగాలు కొనసాగిస్తున్న ఉత్తర కొరియాపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇటీవల ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాతో ఎవరూ ఆయుధ వ్యాపారం చేయరాదని ఆదేశించింది. ఈ తీర్మానంపై రష్యా కూడా సంతకం చేసింది. తమ సంతకాన్ని రద్దు చేసుకొనే అవకాశం లేకపోలేదని అధికార వర్గాలు తాజాగా తేల్చిచెప్పాయి. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వెనక్కి తగ్గితే ఉత్తర కొరియాపై ఆంక్షలు బలహీనమవుతాయి. అప్పు డు ఉత్తర కొరియా నుంచి యథేచ్ఛ గా ఆయు ధాలు కొనుగోలు చేసుకో వచ్చు.
ప్రతిఫలం అదేనా?
రష్యా సంగతి సరే మరి ఉత్తరకొరియాకు దక్కే ప్రయోజనమేంటి?రష్యాకు ఆయుధాలు ఇచ్చి, తిరిగి పొందే ప్రతిఫలం ఏమై ఉంటుంది? కిమ్ రాజ్యంలో ప్రస్తుతం తీవ్ర ఆహార కొరత వేధిస్తోంది. పౌష్టికాహారం అనేది కలలో మాటగా మారింది. అందుకే మానవతా సాయం పేరిట రష్యా నుంచి భారీగా ఆహార ధాన్యాలను తీసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచ్చింది.
అలాగే సైన్యానికి ఉపయోగ పడే శాటిలైట్లు, అణ్వస్త్ర సహిత జలాంతర్గాములు తయారు చేసే అత్యాధునిక టెక్నాలజీ ఉత్తర కొరియా వద్ద లేదు. ఇలాంటి సాంకేతికతలో రష్యా ముందంజలో ఉంది. ఆయుధాలకు ప్రతిఫలంగా ఈ టెక్నాలజీని రష్యా నుంచి సొంతం చేసుకోవాలని కిమ్ ప్రభుత్వం నిర్ణయానికొచి్చనట్లు సమాచారం.
అందుకు పుతిన్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే పుతిన్ తనకు అవసరమైన ఆయుధాలను ఉత్తర కొరియా నుంచి తీసుకుంటారు. బదులుగా ఆహార ధాన్యాలు, ఆధునిక టెక్నాలజీని కిమ్‌కు అందజేస్తారు. ఇద్దరికీ లాభమేనన్నమాట! ఇక ఒప్పందాలపై సంతకాలు చేయడమే మిగిలి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment