బోరోడియాంకాలో విధ్వంసాన్ని పరిశీలిస్తున్న అమెరికా రాయబారి బిగ్జ్రెట్
కీవ్: ఇంతకాలం బాగా ఇబ్బంది పెట్టిన ఆయుధ, ఆహార సరఫరాలు భారీగా పుంజుకోవడంతో ఉక్రెయిన్‌లో రష్యా సైన్యాలు ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదులుతున్నాయి. ముఖ్యంగా అధ్యక్షుడు పుతిన్ తాజా లక్ష్యంగా పేర్కొన్న తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలను తీవ్రతరం చేశాయి. అక్కడ దాడుల తీవ్రతను బాగా పెంచుతున్నాయి. డోన్బాస్‌లో ఉక్రెయిన్ కదలికలకు కీలకమైన పలు బ్రిడ్జీలను రష్యా దళాలు శనివారం పేల్చేశాయి.
అక్కడి లుహాన్స్‌క్ ప్రాంతంలో ఉక్రెయిన్ అధీనంలో ఉన్న చివరి నగరాలైన సెవరోడొనెట్స్‌క్, లిసిషాన్స్‌క్‌పైనా క్రమంగా పట్టు బిగిస్తున్నాయి. పలు అపార్ట్‌మెంట్ భవనాలపై భారీగా కాల్పులకు దిగాయి. అక్కడ ఉక్రెయిన్ దళాలతో వీధి పోరాటం కూడా సాగుతోంది. సెవరోడొనెట్స్‌క్‌లో 90 శాతం రష్యా చేతుల్లోకి వచ్చినట్టు సమాచారం. డోన్బాస్‌లోని రెండో ప్రధాన ప్రాంతమైన డొనెట్స్‌క్‌లో బఖ్ముత్ నగరంపైనా రష్యా దాడుల తీవ్రత పెరిగింది. వీటి ధాటికి ఉక్రెయిన్ సైనికులు భారీ సంఖ్యలో మరణిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
దేశంలోని అతి పెద్ద రేవు పట్టణమైన ఒడెసాలో ఓ వ్యవసాయ ప్రాంతంపై రష్యా క్షిపణి దాడిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం. ఒడెసా నుంచి ఆహార ధాన్యాలఎగుమతులను పునఃప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే ఈ దాడులు జరిగాయి. ఒడిశా తీరప్రాంతంలో ఉక్రెయిన్ యుద్ధపరికరాల తరలింపు విమానాన్ని తాము కూల్చేశామని రష్యా వెల్లడించింది.
డోన్బాస్ ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నపుడు ఉక్రెయిన్ క్షిపణి దాడిలో రష్యా మేజర్ జనరల్ కనమత్ బొటషెవ్(63) మరణించారని రష్యా ధృవీకరించింది. రష్యా వైమానిక దళంలో మేజర్ జనరల్ స్థాయి అత్యున్నత ర్యాంక్ అధికారి మరణించడం ఇదే తొలిసారి. నాటోలో స్వీడన్, ఫిన్లాండ్ చేరికను వ్యతిరేకిస్తున్న తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్‌తో నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఫోన్లో మాట్లాడారు.
(చదవండి: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం)
Comments
Please login to add a commentAdd a comment