
ఐక్యరాజ్యసమితి: భారత్, జపాన్, బ్రెజిల్, ఉక్రెయిన్ లాంటి దేశాలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఎందుకు కల్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిలదీశారు. శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడానికి కారణాలు ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. బుధవారం జరిగిన ఐరాస సాధారణ సభ చర్చా కార్యక్రమంలో వర్చువల్‌గా ప్రసంగించారు. భదత్రా మండలిలో అన్ని గొంతుకలకు అవకాశం కల్పించాలన్నారు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా, సెంట్రల్, ఈస్ట్రన్ యూరప్‌లకు వీటో అధికారం ఉండాలని సూచించారు.
సమతూకంతో కూడిన భదత్రా మండలిని కోరుకుంటున్నామని ఉద్ఘాటించారు. ఇప్పటికే శాశ్వత సభ్యదేశ హోదా పొందిన రష్యా ఇతర దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై ఏనాడూ మాట్లాడలేదని జెలెన్‌స్కీ విమర్శించారు. అందుకు కారణమేంటో చెప్పాలన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇప్పుడు ఐదు శాశ్వత సభ్యదేశాలున్నాయి. అవి రష్యా, యూకే, చైనా, ఫ్రాన్స్, అమెరికా. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని దేశాలకు ఈ హోదా కల్పించాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని భారత్ కోరుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment