పొలాసలోని ఆటోమేటిక్ వాతావరణ కేంద్రం
జగిత్యాల అగ్రికల్చర్: భూమిని దున్నినప్పటి నుంచి పంట పండి, మార్కెట్లో విక్రయించేవరకు ఎప్పటికప్పుడు మారే వాతావరణ పరిస్థితులు రైతులకు ఒక అగ్ని పరీక్షగా మారాయి. రుతుపవనాలు రావడం ఆలస్యమవడం, పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు, వరదలు, తుపాన్లు, అకాల వర్షాలు, అకస్మాత్తుగా వడగళ్లు పడటం, వేడిగాలులు, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు వంటివి పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతూ రైతులకు నష్టాలను మిగుల్చుతున్నాయి.
అధునాతన టెక్నాలజీ..
భారత వాతావరణ శాస్త్ర విభాగం, భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, భారత శాస్త్ర, సాంకేతిక విభాగం, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో వాతావరణ విభాగం ఏర్పాటు చేశాయి. దీని ద్వారా వాతావరణ పరిస్థితులను ఐదు రోజుల ముందుగానే తెలుసుకునే వెసులుబాటు ఉంది. మరింత కచ్చితమైన సమాచారం కోసం అధునాతన టెక్నాలజితో రూపొందించిన నాలుగైదు పరికరాలను బిగించారు. ఇందుకోసం ప్రతిరోజు ఉదయం 7.16 గంటలకు, మధ్యాహ్నం 2.16 గంటలకు వాతావరణ కేంద్రం పరిధిలోని సూర్యరశ్మి, గాలిలో తేమ, ఉష్ణోగ్రత, గాలివేగం, ఏ దిశలో గాలి వీస్తుందన్న అంశాలను సేకరించి, వాతావరణ కేంద్రం వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేస్తారు. దీనికితోడు పూర్తిగా కంప్యూటరీకరించిన కేంద్రం ద్వారా ఎప్పటికప్పుడు మరికొంత డాటా సైతం ఆటోమేటిక్‌గా భారత వాతావరణ కేంద్రానికి వెళ్తుంది. సెలవులంటూ లేకుండా 365 రోజులు ఈ కేంద్రం పని చేస్తుంది. ఇందులో వర్షం, గాలి వేగం, ఉష్ణోగ్రతలకు సంబంధించిన పరికరాలన్నీ ఒకేదాంట్లో ఇమిడి ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్లిన సమాచారాన్ని బట్టి వాతావరణాన్ని అంచనా వేసి, వెంటనే సంబంధిత వాతావరణ కేంద్రానికి పంపిస్తారు.
ముందస్తు సమాచారంతో రైతులు అప్రమత్తం
రాబోయే ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయాలు ఈ ఆటోమేటిక్ కేంద్రం వల్ల తెలుస్తాయి. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి మంగళ, శుక్రవారాల్లో ప్రత్యేక బులెటిన్‌ను పత్రికలు, మీడియాకు, వ్యవసాయ శాఖ అధికారులకు విడుదల చేస్తారు. దీంతోపాటు అప్పటి వాతావరణాన్ని బట్టి రైతులు పంటల సాగులో ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తారు. ముందస్తు వాతావరణ సమాచారం తెలియడం వల్ల అన్నదాతలు అప్రమత్తమై, పంట నష్టాన్ని, సాగు ఖర్చులను తగ్గించుకునే వెసులుబాటు ఉంటుంది.
వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి
వాతావరణానికి సంబంధించిన ముందస్తు సమాచారం మాకు చాలా ఉపయోగపడుతుంది. వర్షం వస్తుందని తెలిస్తే ఎరువులు వేయడం ఆపేస్తాం. ధాన్యం ఆరబెడితే వెంటనే కవర్లు కప్పుకుంటున్నాం. పంటలకు సాగు నీరందివ్వడం బంద్ చేస్తాం. ఈ సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టాలి.
– కాటిపెల్లి గంగారెడ్డి, రాయికల్
Comments
Please login to add a commentAdd a comment