జగిత్యాల: వరి స్థానంలో కూరగాయల సాగు | - | Sakshi
Sakshi News home page

జగిత్యాల: వరి స్థానంలో కూరగాయల సాగు

Published Mon, Jul 24 2023 12:14 AM | Last Updated on Mon, Jul 24 2023 6:24 PM

 రైతులు సాగుచేసిన కాకరకాయ తోట  - Sakshi

రైతులు సాగుచేసిన కాకరకాయ తోట

జగిత్యాల అగ్రికల్చర్‌: రైతులు ప్రతీ ఏడాది రెండు సీజన్లలో వరిసాగు చేస్తున్నప్పటికీ పెద్దగా ఆదాయం సమకూరడం లేదు. దీంతో అభ్యుదయ రైతులు వినూత్న సాగుకు శ్రీకారం చుట్టారు. వరిసాగు చేసే భూమిలో, రకరకాల కూరగాయలను పండిస్తున్నారు. దీనికి తోడు, ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉండడంతో, కూరగాయల నాణ్యత చెడిపోకుండా స్టేకింగ్‌ పద్ధతిలో సాగు చేస్తున్నారు. వీరిని చూసి ఆ గ్రామంలోని మరి కొంతమంది రైతులు సైతం కూరగాయల సాగుకు ఉపక్రమిస్తున్నారు. ఆ రైతులే రాయికల్‌ మండలంలోని అలూర్‌ గ్రామానికి చెందిన మెక్కొండ రాంరెడ్డి, నల్లాల తిరుపతి, నల్లాల గంగారెడ్డి.

జూన్‌ మొదటి వారంలోనే...

ఈ రైతులు ముందుగా జూన్‌ మొదటి వారంలో సమావేశమై, ఎలాంటి కూరగాయల సాగుచేయాలో నిర్ణయించుకున్నారు. వినియోగదారుల నుంచి డిమాండ్‌ ఉన్న బీరకాయ, సోరకాయ, కాకరకాయ, టమాట, అలిసెంత వంటి కూరగాయలు సాగుచేయాలనుకున్నారు. దీంతో నాణ్యమైన విత్తనాలను వివిధ కంపెనీల నుంచి కరీంనగర్‌లో కొనుగోలు చేశారు. విత్తనం, కంపెనీని బట్టి 50 గ్రాముల విత్తనాన్నే, రూ. 900కు కొనుగోలు చేశారు. విత్తనం నాటే భూమిలో పశువుల ఎరువువేసి, ట్రాక్టర్‌తో రెండు, మూడుసార్లు బాగా దున్నించారు. తర్వాత, మట్టి బెడ్‌లు తయారుచేసి, వాటిపై సాగునీరందేలా డ్రిప్‌ పైపులు వేశారు. కలుపు మొక్కలు రాకుండా మల్చింగ్‌ షీట్‌ సైతం వేశారు. అనంతరం, మల్చింగ్‌ షీట్‌కు రంధ్రాలు చేసి, అందులో కరీంనగర్‌ నుంచి తెచ్చిన విత్తనాలు నాటారు.

నాణ్యత దెబ్బతినకుండా స్టేకింగ్‌

కూరగాయల నాణ్యత దెబ్బతినకుండా కంక బొంగులతో స్టేకింగ్‌ ఏర్పాటు చేశారు. ఇందుకోసం, తీగజాతీ కూరగాయలైన సోరకాయ, కాకరకాయ, బీరకాయలు నేలపై పారితే ముడుచుకుపోయి, మార్కెట్‌లో రేటు ఉండదు. దీంతో మొక్కలకు తీగపారగానే, తీగకు సుతిల్‌తో కట్టి, కంక బొంగులకు పాకించడం చేస్తున్నారు. దీంతో మొక్కకు సరైన గాలి, సూర్యరశ్మీ తగిలి మొక్క ఏపుగా పెరుగుతుంది. మొక్కకు పెద్దగా పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉండదు.

పురుగు మందులు కొట్టకుండా... సోలార్‌ ట్రాప్‌లు..

సాధారణంగా కూరగాయల పంటలను పూత, పిందె దశలో పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. దీంతో, రైతులు రకరకాల పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. కానీ, ఈ రైతులు సమాజ శ్రేయస్సేకోసం పురుగుమందులు వాడకుండా పురుగులను ఆశించే సోలార్‌ ట్రాప్‌లు, పండు ఈగ ఆకర్షక బుట్టలు పెడుతున్నారు. మొక్కలు బలంగా పెరిగేందుకు యూరియా, డీఏపీ వంటి రసాయన ఎరువులు వేయకుండా, మజ్జిగ, బెల్లంతో కూడిన పుల్లటి పదార్థాన్ని మొక్కలకు అందిస్తున్నారు.

మార్కెట్‌కు కూరగాయలు...

తమ పొలంలో పండించిన కూరగాయలను జగిత్యాలతో పాటు రాయికల్‌కు తరలిస్తున్నారు. అయితే కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ఇప్పుడిప్పుడే పంట చేతికి అందుతుంది. కాబట్టి రైతుల పొలాల్లో కూరగాయల పంట దిగుబడులు సెప్టెంబర్‌ వరకు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉండడంతో, తమకు కలిసి వస్తుందని రైతులు ఆశిస్తున్నారు. కూరగాయలు సాగుచేసే రైతులకు సబ్సిడీపై విత్తనాలు డ్రిప్‌, మల్చింగ్‌ పరికరాలు అందించాలని రైతులు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
 బీరకాయ తోట 1
1/2

బీరకాయ తోట

పురుగులను ఆకర్షించే సోలార్‌ ట్రాప్‌ 2
2/2

పురుగులను ఆకర్షించే సోలార్‌ ట్రాప్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement