గల్ఫ్‌ ట్రావెల్స్‌పై నిఘా కరువు | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ ట్రావెల్స్‌పై నిఘా కరువు

Published Tue, Apr 23 2024 8:25 AM

గల్ఫ్‌ వెళ్లేందుకు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరైన నిరుద్యోగులు (ఫైల్‌) - Sakshi

జగిత్యాలక్రైం: ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లే వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని అదునుగా తీసుకుంటున్న కొంతమంది ట్రావెల్స్‌ యజ మానులు గల్ఫ్‌ ఏజెంట్ల అవతారం ఎత్తుతున్నారు. గల్ఫ్‌ పంపిస్తామంటూ పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా నుంచి గల్ఫ్‌ వెళ్లేవారి సంఖ్య రెండేళ్లుగా పెరుగుతోంది. అదేస్థాయిలో జిల్లాలో సుమారు 160 ట్రావెల్స్‌ అనధికారికంగా కొనసాగుతున్నాయి. సదరు ట్రావెల్స్‌ యజమానులు గ్రామీణులు, పట్టణ ప్రాంతాలంటూ తేడా లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల పట్టణాలతోపాటు 20 మండలాల్లో గల్ఫ్‌ ట్రావెల్స్‌ పేరున సుమారు 160 ట్రావెల్స్‌ ఉన్నాయి. వీరు వాస్తవానికి విమాన టికెట్స్‌ బుకింగ్‌ చేసేందుకే అనుమతి తీసుకుంటాయి. కానీ.. నిరుద్యోగుల అవకాశాన్ని ఆసరా చేసుకుని ఉపాధి కల్పిస్తామని చెప్పి నమ్మిస్తాయి. వారి నుంచి పాస్‌పోర్టులు తీసుకొని ఇంటర్వ్యూలకు హాజరుపరుస్తూ వీసా వచ్చిందని నమ్మిస్తూ అందినంతా దండుకుంటున్నాయి. అదే ట్రావెల్స్‌లో అనుమతులు లేకుండానే మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. నిరుద్యోగులు కూడా స్థానికంగా ఉన్న ట్రావెల్స్‌లకు లైసెన్స్‌ లేదని తెలిసినా.. వారిని నమ్మి లక్షలాది రూపాయలు చేతిలో పెట్టి మోసపోతున్నారు.

26 మందికే లైసెన్స్‌

జిల్లాలో గల్ఫ్‌ పంపించేందుకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి కేవలం 26 మంది ఏజెంట్లు మాత్రమే లైసెన్స్‌లు తీసుకుని ట్రావెల్స్‌ నిర్వహిస్తున్నారు. మరో ముగ్గురు లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మిగతా వారు అనుమతులు లేకుండానే ట్రావెల్స్‌, ఏజెంట్లుగా చలామణి అవుతూ నిరుద్యోగులకు వీసాల పేరుతో పెద్ద ఎత్తున వసూలు చేస్తున్నారు.

లైసెన్స్‌ లేకున్నా ఇంటర్వ్యూలు

గల్ఫ్‌ ఏజెంట్లు, ట్రావెల్స్‌ నిర్వాహకులు లైసెన్స్‌ ఉ న్నప్పటికీ ఎస్బీ (స్పెషల్‌ బ్రాంచ్‌) పోలీసులకు స మాచారం అందించి ఇంటర్వ్యూలు నిర్వహించాలి. కానీ వారు పోలీసులకు ఎలాంటి సమాచారం లే కుండానే ఇష్టారీతిలో జిల్లాకేంద్రంలోనే పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌, ముంబయ్‌, చైన్నె, ఢిల్లీలో ఉన్న ట్రావెల్స్‌ యజమానులతో కలిసి ఈ తతంగం కొనసాగిస్తున్నారు. ని రుద్యోగులను ఇంటర్వ్యూలకు పిలిపించి అర్హత సా ధించారంటూ పాస్‌పోర్టులు తీసుకుంటున్నారు. అ నంతరం వారికి ఏదో ఒక వీసా అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. కొన్ని ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పత్రికల ప్రకటనలు కూడా ఇస్తూ నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరయ్యేలా వాట్సా ప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియాల్లో ట్రావెల్స్‌ నిర్వాహకులు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. వారు ప్రచారానికి వాడే ప్రచార లైసెన్స్‌లు మాత్రం హైదరాబాద్‌, ముంబయ్‌, బెంగళూరు లాంటి ప్రాంతాలకు చెందిన ట్రావెల్స్‌ల పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.

యూరప్‌ దేశాలకూ ఇంటర్వ్యూలు

లైసెన్స్‌ ఉన్న ట్రావెల్స్‌ యజమానులు గల్ఫ్‌ దేశాలకు మాత్రమే నిరుద్యోగ యువకులను పంపించేవారు. కానీ ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా లైసెన్స్‌లు ఉన్న వారు, లేని వారు నిరుద్యోగులను యూరప్‌ దేశాల్లో ఉద్యోగాలున్నాయని సుమారు రూ.రెండు లక్షల నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేస్తున్నారంటే అతిశయోక్తికాదు. ప్రస్తుతం పోలీసు శాఖ పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉండటంతో ఇదే అదునుగా చూస్తున్న ఏజెంట్లు, ట్రావెల్స్‌ నిర్వాహకులు వారంరోజులుగా జోరుగా గల్ఫ్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. వీసా వచ్చిందని, (మెడికల్‌) వైద్య పరీక్షలు పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారు.

జిల్లాలో విచ్చలవిడిగా అర్హత లేని ట్రావెల్స్‌

అనుమతులు లేకుండానే ఇంటర్వ్యూలు

మెడికల్‌ టెస్ట్‌ పేరుతో వసూళ్లు

నకిలీ వీసాలు అంటగట్టి మోసాలు

జగిత్యాల రూరల్‌ మండలం పొరండ్ల, రాయికల్‌ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు సొంతూరులో ఉపాధి కరువవడంతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. వీరి అవకాశాన్ని నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆసరాగా చేసుకుని రూ.లక్ష తీసుకుని ఏడాది కాలంగా విదేశాలకు పంపించకుండా మోసానికి పాల్పడ్డాడు.

బీర్‌పూర్‌ మండలం కొల్వాయికి చెందిన ఇద్దరు యువకులు మంచిర్యాల జిల్లా కడెం మండలానికి చెందిన ఓ యువకుడు నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్‌పల్లికి చెందిన ఓ గల్ఫ్‌ ఏజెంట్‌కు యూరప్‌ దేశానికి వెళ్లేందుకు రూ.9 లక్షలు చెల్లించాడు. ఏడాది గడుస్తోంది. దీంతో సదరు యువకుడు పోలీసులను ఆశ్రయించగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.

కఠిన చర్యలు తీసుకుంటాం

జిల్లా నుంచి గల్ఫ్‌ వెళ్లే వారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఎమిగ్రేషన్‌ చట్టబద్ధత ఉన్నవారి నుంచే వీసాలు పొందాలి. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్‌ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితులు ఫిర్యాదు చేస్తే మోసగాళ్లపై కేసులు నమోదు చేస్తాం.

– సన్‌ప్రీత్‌సింగ్‌, ఎస్పీ

1/2

2/2

Advertisement
Advertisement