దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది | Sakshi
Sakshi News home page

దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది

Published Sat, May 11 2024 1:45 AM

దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది

● ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ మాజీ డైరెక్టర్‌ విలాస్‌ ఎ తొనపి

జగిత్యాలఅగ్రికల్చర్‌: దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిదని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్స్‌ రీసెర్చ్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ విలాస్‌ ఎ తొనపి అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం పొలాస వ్యవసాయ కళాశాలలో శుక్రవారం జరిగిన కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయ రంగంలో వాతావరణ మార్పులతో పాటు, తెగుళ్లు వంటి అనేక సవాళ్లు రైతులకు ఎదురవుతున్నాయని, వాటిని ఎదుర్కోవాల్సిన బాధ్యత నేటి వ్యవసాయ విద్యార్థులపై ఉందన్నారు. సాగులో ఆదాయం తగ్గుతుండటంతో రైతులు ఇతర వ్యాపకాల వైపు మొగ్గుచూపుతున్నారని, దీంతో దేశ ఆర్థికాభివృద్ధి, ఆహార సమతుల్యతలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను అందుకోవాలని సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఎఫైర్‌ డాక్టర్‌ సత్యనారాయణ మాట్లాడుతూ, సాగురంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు విద్యార్థులు అధ్యయనం చేసి రైతులకు వివరించాలన్నారు. దేశాభివృద్ధిలో వ్యవసాయ విద్యార్థులు కీలకం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కాలేజీ మ్యాగజైన్‌ను విడుదల చేశారు. కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ భారతి నారాయణ్‌భట్‌, స్టూడెంట్‌ ఎఫైర్‌ కన్వీనర్‌ డాక్టర్‌ మహేశ్‌రెడ్డి, ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement