ప్రజల భవితకే కుల గణన | - | Sakshi
Sakshi News home page

ప్రజల భవితకే కుల గణన

Published Sat, Nov 2 2024 1:39 AM | Last Updated on Sat, Nov 2 2024 1:39 AM

ప్రజల

ప్రజల భవితకే కుల గణన

● ప్రతిష్టాత్మక కుల సర్వేకు సహకరించండి ● ప్రజాభిప్రాయానికే బీసీ కమిషన్‌ పెద్దపీట ● ఉన్నది ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక ● క్షేత్రస్థాయి పరిస్థితులతోనే నిర్ణయాలు ● బహిరంగ విచారణలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ ● 9 గంటల పాటు ఓపికగా వినతుల స్వీకరణ

కరీంనగర్‌ అర్బన్‌:

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనెల 6 నుంచి చేపట్టనున్న కులగణన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కులాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ స్పష్టం చేశారు. బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాను ఖరారు చేసే అంశంపై శుక్రవారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లావాసులతో విచారణ నిర్వహించారు. కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల బీసీ కుల సంఘాలు హాజరై అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు బీసీ కులసంఘాలు, ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. అభిప్రాయాలను ఓపికగా ఆలకించిన చైర్మన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వివరించారు. ఇప్పు డు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే మిస్‌ అయితే మళ్లీ ఎప్పుడు జరుగుతదో తెలియదని, రాష్ట్రంలో ఏ కులాల వారు ఎంతమంది ఉన్నారు? బీసీలు ఓసీలు, ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు సంచార జాతులు ఎంతమంది ఉన్నారో? సర్వే ద్వారా వెల్లడవుతుందని తెలిపారు. ప్రజల ఆర్థిక, సామాజిక పరిస్థితిని అంచనా వేయడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. బీసీల రిజర్వేషన్‌ అంశంపై క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించిన విజ్ఞప్తులను ఉన్నది ఉన్నట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. కులసంఘాలు, ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ఎవరినీ ఇందులో నుంచి విస్మరించవద్దని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించకుండా సర్వేకు సహకరించాలని కోరారు. బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా నుంచి తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. వాటిని క్రోడీకరించి తగిన నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని కమిషన్‌ బాధ్యులు చెప్పారు. రిజర్వేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రజలు సహకరించాలని, బీసీ కులసంఘాల ప్రతినిధులు ప్రజలవెంట ఉండాలని సూచించారు. గత బీఆర్‌ఎస్‌ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఎక్కడుందో ఆ దేవుడికి కూడా తెలియదన్నారు. ఎవరైనా కులాలపై తప్పుడు సమాచారం ఇస్తే కఠిన చర్యలకు తప్పవని హెచ్చరించారు. బీసీ కమిషన్‌ సభ్యులు రాపోలు జయప్రకాశ్‌, తిరుమలగిరి సురేందర్‌, రంగు బాలలక్ష్మి మాట్లాడుతూ బహిరంగ విచారణలో బీసీ కులాలు, జాతుల్లో నెలకొన్న ఆవేదన తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దశాబ్దాల ప్రజల కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చబోతున్నదన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఎన్యూమరేటర్లు పకడ్బందీగా నిర్వహించాలని, ప్రజలందరూ సహకరించాలని కోరారు.

హౌస్‌ లిస్టింగ్‌ ప్రక్రియ

– కలెక్టర్‌ పమేలా సత్పతి

ప్రజాసంక్షేమం కోసం చేపడుతున్న సర్వేను ప్రజ లంతా కలిసికట్టుగా విజయవంతం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన హౌస్‌ లిస్టింగ్‌ ఎక్సర్‌సైజ్‌ శుక్రవారం నిర్వహించామన్నారు. వైద్య, ఉద్యోగ, రాజకీయపరంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఏ ఒక్కరూ మిస్‌ కాకుండా అందరి వివరాలు నమోదు చేసేలా సహకరించాలన్నారు. జగిత్యాల కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ మాట్లాడుతూ కులగణన సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరారు.ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకెళ్తున్నదని తెలిపారు. బీసీల రిజర్వేషన్ల అమలుకు సంబంధించి బీసీ కమిషన్‌ సభ్యులు విచారణ జరిపారని చెప్పారు. బీసీ కులాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు అన్ని వివరాలు వారికి అందజేశారని పేర్కొన్నారు.

9 గంటల పాటు విచారణ

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేసే విషయమై వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లా స్థాయిలో బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, సభ్యులు 9 గంటల పాటు బహిరంగ విచారణ చేపట్టారు. నాలుగు జిల్లాల నుంచి తరలివచ్చిన బీసీ సంఘాల నాయకులు, కులస్తుల అభిప్రాయాలు తెలుసుకొని విజ్ఞప్తులు స్వీకరించారు.

కరీంనగర్‌: 99

రాజన్న సిరిసిల్ల: 53

పెద్దపల్లి: 32

జగిత్యాల: 29

జిల్లాల వారీగా వినతులు

వినతుల స్వీకరణకు హెల్ప్‌డెస్క్‌లు

ఈ సందర్భంగా నాలుగు జిల్లాల వారీగా వచ్చిన అర్జీలను స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు సంబంధించి వేర్వేరుగా హెల్ప్‌డెస్క్‌లు ఏర్పా టు చేశారు. రిజిస్ట్రేషన్‌ చేసుకుని సదరు వివరాలను 6 సెట్లలో అందించగా తదుపరి బీసీ కమిషన్‌తో మాట్లాడేందుకు అనుమతించా రు. కార్యక్రమంలో పెద్దపల్లి, జగిత్యాల, రాజ న్నసిరిసిల్ల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, సత్యప్రసాద్‌, సందీప్‌ కుమార్‌ ఝా, అదనపు కలెక్టర్లు ప్రఫుల్‌ దేశాయ్‌, కరీంనగర్‌ ఆర్డీవో మహేశ్వర్‌, బీసీడీవో అనిల్‌ప్రకాశ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజల భవితకే కుల గణన1
1/1

ప్రజల భవితకే కుల గణన

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement