జెర్రీ.. బొద్దింక.. ఫంగస్
జగిత్యాల: ప్రజలారా.. తస్మాత్ జాగ్రత్త.. జగిత్యాల పట్టణంలోని హోటళ్లలో తినేందుకు వెళ్తున్నారా.. కాస్త అప్రమత్తంగా ఉండండి. ఒకటికి రెండుసార్లు చూసి తినండి. లేకుంటే మీ ప్రాణాలకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే.. మొన్న తహసీల్ చౌరస్తాలోని ఓ హోటల్‌లో ఇడ్లీలో జెర్రీ వచ్చింది. బుధవారం కొత్తబస్టాండ్‌లోని మరో టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీలో బొద్దింక రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం తహసీల్ చౌరస్తాలోని ఉడిపి హోటల్‌లోని చపాతిలో ఫంగస్ రావడంతో అది కొన్నవారు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని ఉడిపిహోటల్‌లో ఇడ్లీ తినేందుకు ఓ దంపతులు వెళ్లారు. పిల్లలకు తిన్పిస్తున్న సమయంలో ఇడ్లీలో జెర్రీ కన్పించడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వారి ఫిర్యాదు మేరకు ఫుడ్‌సేఫ్టీ అధికారులు హోటల్‌ను సీజ్ చేశారు. బుధవారం కొత్తబస్టాండ్‌లోని ముత్తు అనే టిఫిన్ సెంటర్‌లో ఓ యువకుడు ఇడ్లీ తినేందుకు వెళ్లగా అందులో బొద్దింక వచ్చింది. వెంటనే యజమానికి ఫిర్యాదు చేయగా చెత్తకుప్పలో పడేశాడు. శుక్రవారం కార్తీక్ అనే వ్యక్తి ఉడిపి హోటల్‌లో చపాతి పార్శిల్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లాడు. తినేందుకు ఓపెన్ చేయగా ఆ చపాతి అంతా ఫంగస్‌తో కూడుకుని ఉంది. వెంటనే హోటల్‌కు తీసుకెళ్లి యజమానికి చూపించాడు. కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ చివరికి తప్పు ఒప్పుకున్నాడు. ఇటీవలే ఇదే హోటల్‌లో ఇడ్లీలో జెర్రీ రావడంతో బాధితులు తీవ్ర ఆందోళన చేపట్టగా మున్సిపల్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అధికారులు సీజ్ చేశారు. జరిమానా చెల్లించి మళ్లీ హోటల్‌ను ఓపెన్ చేశారు.
జరిమానాతో సరి...
ఉడిపిహోటల్‌లో ఇడ్లీలో బొద్దింక వచ్చినప్పటికీ ఒక్కరోజు సీజ్‌చేసి, జరిమానా చెల్లించి యథావిధి గా నడిపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇలాంటి సంఘటనలు జరగవని ప్రజలు పేర్కొంటున్నారు. హోటళ్లపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో తమ ఆరోగ్యానికి గ్యారంటీ లేకుండా పోయిందని స్థానికులు అంటున్నారు. ఈ విషయమై ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూషకు ఫోన్ చేయగా.. అందుబాటులోకి రాలేదు.
ప్రజలారా.. కాస్త చూసి తినండి
పట్టణంలో బెంబేలెత్తిస్తున్న హోటళ్లు
కొరవడుతున్న శుభ్రత
పట్టించుకోని అధికారులు
ప్రజల ప్రాణాలకు ముప్పు
హోటళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ కమిషనర్ చిరంజీవి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు హోటళ్లు, బేకరీల్లో తనిఖీలు నిర్వహించారు. ఆహార పదార్థాలు నాణ్యతతో కూడినవి విక్రయించాలని సూచించారు. లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాలం చెల్లిన ఆహార పదార్థాలు అమ్మినా, నిబంధనలు పాటించకపోయినా జరిమానా విధిస్తామన్నారు. అనంతరం పలు హోటళ్లలో కాలంచెల్లి న ఆహార పదార్థాలు, నిల్వ ఉంచిన ఆహార పదార్తాలను డంపింగ్‌యార్డుకు తరలించారు. పలు హోటళ్లకు జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment