ప్రాజెక్టులపై రివ్యూ | - | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టులపై రివ్యూ

Published Tue, Nov 26 2024 1:51 AM | Last Updated on Tue, Nov 26 2024 1:51 AM

ప్రాజ

ప్రాజెక్టులపై రివ్యూ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ సభలో.. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇన్‌చార్జి మంత్రి, సాగునీటిశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కూడా పాత కరీంనగర్‌ జిల్లాలోని 13 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో భేటీ అవుతారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మంత్రి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. నిధులు, పనుల పురోగతిపై సమీక్షించనున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పనులు వేగిరమవుతాయని కాంగ్రెస్‌ నాయకులు ఽధీమాగా ఉన్నారు. చాలా ప్రాజెక్టులు దాదాపు చివరి దశలో ఉండగా.. కొన్ని కొత్తవి కావడం గమనార్హం. వచ్చే నెల 4న పెద్దపల్లిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం రానున్నారు. ఆయన ఏం ప్రకటిస్తారోనన్న ఉత్కంఠ ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది.

30న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌ భేటీ

నిధులు, పనుల పురోగతిపై సమీక్ష

వచ్చే నెల 4న పెద్దపల్లిలో భారీ బహిరంగ సభ

హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఏం ప్రకటిస్తారోనని ప్రజల్లో ఉత్కంఠ

గుంటి మడుగుపై గంపెడాశలు

కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని పెద్దరాతుపల్లి సుంకరికోటల వద్ద గుంటిమడుగు ఎత్తిపోతల పథకంపై ఈ ప్రాంత రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఈ పథకం కోసం అప్పటి కలెక్టర్‌ అలుగు వర్షిణి, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, అది సర్వే దశలోనే నిలిచిపోయింది. సుమారు రూ.100 కోట్ల అంచనాతో ఎత్తిపోతలకు రూ.కోటి వెచ్చించి, ఏరియల్‌ సర్వే పూర్తి చేశారు. పథకం పూర్తయితే.. పెద్దపల్లి జిల్లాలోని కాల్వశ్రీరాంపూర్‌, ఓదెల మండలాల ఎస్సారెస్పీ డీ–86, 83 కాలువల చివరి భూములు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల చిట్యాల భూములు సుమారు 50 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. తాగునీటి కొరత తీరుతుంది.

మల్కపేట రిజర్వాయర్‌..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీలో భాగంగా మల్కపేట రిజర్వాయర్‌ నిర్మించారు. సిరిసిల్ల మధ్యమానేరు బ్యాక్‌ వాటర్‌ను సొరంగం ద్వారా 12 కిలోమీటర్ల దూరంలోని మల్కపేటకు మళ్లించారు. గతేడాది రెండు పంపులకు ట్రయల్‌ రన్‌ నిర్వహించి, 1 టీఎంసీ నీటిని నింపారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఖర్చు చేసింది రూ.1464.48 కోట్లు. ఆయకట్టు 2.73 లక్షల ఎకరాలు కాగా, ఇంకా కావాల్సిన నిధులు రూ.370 కోట్లు. మల్కపేట నుంచి ఎగువ మానేరు వరకు కెనాల్‌ ద్వారా గోదావరి జలాలను తరలించాల్సి ఉంది.

95 శాతం పూర్తయిన ‘రోల్లవాగు’..

జగిత్యాల జిల్లా బీర్పూర్‌ మండలంలోని రోల్ల వాగు ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.137 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రాజెక్టు నిర్మాణం 95 శాతం పూర్తయింది. దిగువకు నీటిని విడుదల చేయడానికి 3 తూములను ఏర్పాటు చేశారు. అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో వాటికి గేట్లు బిగించలేదు. దీంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీరు వచ్చినట్లే బయటకు వెళ్లిపోతోంది. ఈ ప్రాజెక్టులో అటవీ శాఖకు చెందిన 800 ఎకరాల భూమి ముంపునకు గురవుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం అటవీ శాఖకు జగిత్యాల జిల్లా వెల్గటూర్‌, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లోని రెవెన్యూ భూములను కేటాయించింది. అధికారులు అటవీశాఖ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌కు నివేదిక పంపారు. ప్రస్తుతం అటవీశాఖకు సంబంధించి నీటిలో మునిగిపోయిన చెట్ల లెక్కింపు పూర్తి కావొచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే 1 టీఎంసీ నీరు నిల్వ ఉండి, బీర్పూర్‌, ధర్మపురి మండలాల్లో 20 వేల ఎకరాలకు సాగు నీరందుతుంది. వర్షపు నీరు, ఎస్సారెస్పీ డీ–53 కాలువ ద్వారా వచ్చే నీరు రోళ్లవాగులోకి చేరి, అక్కడి నుంచి పంటలకు అందుతుంది.

‘పత్తిపాక’పై ముందుకే..

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామంలో పత్తిపాక ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. 7.78 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలంటే సుమారు 1,700 ఎకరాల భూమి(400 ఎకరాలు అటవీ, 1,300 ఎకరాలు పట్టా భూములు) సేకరించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి, చొప్పదండి, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 2.40 లక్షల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు భూముల స్థిరీకరణతోపాటు కొత్తగా.. 15 నుంచి 20 వేల ఎకరాలకు సాగు నీరందించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా.. పత్తిపాక ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలాన్ని మంత్రి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు శనివారం ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి, పరిశీలించారు. ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే.. డీటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌(డీపీఆర్‌) రూపొందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

కలికోట సూరమ్మ ప్రాజెక్టు..

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలంలోని కలికోట సూరమ్మ చెరువు రిజర్వాయర్‌ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. మొన్నటి బడ్జెట్‌లో ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. మొత్తం 43 వేల ఎకరాలకు సాగు నీరివ్వడం దీని లక్ష్యం. ఇది పూర్తయితే.. మేడిపల్లి, భీమారం, రుద్రంగి, కథలాపూర్‌ మండలాల్లోని బీడు భూములు సాగులోకి వస్తాయి. రాష్ట్రంలోని 9 ప్రధాన ప్రాజెక్టుల్లో కలికోట సూరమ్మ చెరువును చేర్చారు. కుడి, ఎడమ కాలువ నిర్మాణానికి భూసేకరణ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రాజెక్టులపై రివ్యూ1
1/5

ప్రాజెక్టులపై రివ్యూ

ప్రాజెక్టులపై రివ్యూ2
2/5

ప్రాజెక్టులపై రివ్యూ

ప్రాజెక్టులపై రివ్యూ3
3/5

ప్రాజెక్టులపై రివ్యూ

ప్రాజెక్టులపై రివ్యూ4
4/5

ప్రాజెక్టులపై రివ్యూ

ప్రాజెక్టులపై రివ్యూ5
5/5

ప్రాజెక్టులపై రివ్యూ

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement