డిజిటల్ ల్యాండ్ రికార్డులకు ఏర్పాట్లు చేయండి
జగిత్యాల: డిజిటల్ ల్యాండ్ రికార్డుల నమోదుకు దేశంలోని వంద పట్టణాలను పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశామని, ఆ పట్టణాల్లో కార్యాచరణ కట్టుదిట్టంగా అమలు చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్ మనోజ్ జోషి అన్నారు. గురువారం నేషనల్ జియో స్పెషియల్ నాలెడ్జ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ (నక్ష)పై జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భూ రికార్డులను డిజిటలైజ్ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించిందని, ఇందులో కొన్ని పట్టణాలను పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిందని, అందులో జగిత్యాల కూడా ఉందని పేర్కొన్నారు. నక్ష అమలుకు నోడల్ అధికారులను నియమించాలని, మ్యాన్‌పవర్, కార్యాలయాలు, సామగ్రి సమకూర్చాలని సూచించారు. అదనపు కలెక్టర్ లత మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో భూ రికార్డులను డిజిటలైజ్ చేస్తున్నామని, జిల్లాకేంద్రం, గ్రామాల్లో భూ రికార్డులకు సంబంధించి రీసర్వే వివరాలను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గౌతంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి పాల్గొన్నారు.
పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం
జగిత్యాలటౌన్: పేదల హక్కుల కోసం సామాజిక పోరాటం చేసిన మహాత్మ పూలే స్ఫూర్తితో ముందుకెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ అన్నారు. సంఘం ఆద్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో పూలే వర్ధంతిని నిర్వహించారు. పూలే పోరాట ఫలితంగానే బడుగు, బలహీనవర్గాలు సమాజంలో ఆత్మగౌరవంతో జీవించడంతోపాటు హక్కులు పొందగలుగుతున్నారని అన్నారు. పూలే ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. నాయకులు తిరుపురం రాంచందర్, బొమ్మిడి నరేష్‌కుమార్, బండపెల్లి మల్లేశ్వరి, రాపర్తి రవి, హృషికేష్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాజోజి ముఖేష్‌ఖన్నా పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఆర్టీసీలో వనభోజనాలు
జగిత్యాలటౌన్/కోరుట్ల: జిల్లాలోని ఆర్టీసీ సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి గురువారం కార్తీక వనభోజనాలకు వెళ్లారు. జగిత్యాల, కోరుట్ల డిపో మేనేజర్లు సునీత, మనోహర్ ఆధ్వర్యంలో ఆటాపాటలతో ఉల్లాసంగా గడిపారు. మేనేజర్లు కార్మికులతో కలిసి భోజనాలు చేశారు. కార్మికులు, సిబ్బంది విధుల్లో ఎదుర్కొనే ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. జగిత్యాల ట్రాఫిక్ సూపర్‌వైజర్ శ్రీనివాస్, ఆఫీస్ సూపరింటెండెంట్ జగదీశ్వరీ, మెయింటెనెన్స్ ఇన్‌చార్జి విజయ్, సెక్యూరిటీ హెడ్‌కానిస్టేబుల్ శేఖర్, కోరుట్లలో అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.
‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి
జగిత్యాల: పదో తరగతిలో వందశాతం ఫలితాలు సాధించాలని డీఈవో కె.రాము అన్నారు. జిల్లా కేంద్రంలోని టీచర్స్ భవన్‌లో గురువారం స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. వందశాతం ఉత్తీర్ణతకు ఇప్పటినుంచే ప్రణాళిక రూపొందించాలని, ఆమేరకు తరగతులు నిర్వహించాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. డిసెంబర్ 4న నిర్వహించే నాస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు కొక్కుల రాజేశ్, సత్యనారాయణ, మహేశ్, మురళీమోహన్‌చారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment