అనారోగ్యంతో పారిశుధ్య కార్మికుడి మృతి
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలక సంస్థ పారిశుధ్య కార్మికుడు(ట్రాక్టర్ డ్రైవర్) దాసరం మురళి అనారోగ్యంతో గురువారం మృతిచెందాడు. నగరపాలిక అదనపు కమిషనర్ సువార్త ఆరెపల్లిలోని ఆయన ఇంటికి వెళ్లి, మృతదేహానికి నివాళి అర్పించారు. మృతుడి కుటుంబసభ్యులను ఓదార్చారు.
వ్యవసాయ బావిలో వ్యక్తి మృతదేహం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని వ్యవసాయ బావిలో గురువారం ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడి వద్ద లభించిన ఆధార్‌కార్డును బట్టి నందకిశోర్‌రాం, బిహార్ రాష్ట్రంలోని నార్సింగంజ్‌వాసిగా గుర్తించినట్లు ఎస్సై లక్ష్మణ్‌రావు తెలిపారు. అతని మృతికి గల కారణాలపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.
ఉపాధ్యాయుడి సస్పెన్షన్
జగిత్యాల: జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలిని లైంగిక వేధింపులకు పాల్పడిన ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. వేధింపులు భరించలేని ఉపాధ్యాయురాలు ఇటీవల కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. విచారణ చేపట్టిన అధికారులు డీఈవోకు నివేదించారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.
ఉమ్మడి జిల్లా రైఫిల్ షూటింగ్ పోటీలు
పెద్దపల్లిరూరల్: క్రీడలు స్నేహబంధాలను పెంపొందిస్తాయని సీఐ ప్రవీణ్‌కుమార్ అన్నారు. పెద్దపల్లి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలను ప్రారంభించి మాట్లాడారు. రైఫిల్‌షూట్ పోటీలు విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంపొందిస్తాయన్నారు. అండర్–14, అండర్–17 బాలబాలికలకు నిర్వహించిన పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన వారికి ఈనెల 30న హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీ గన్‌ఫ్లోర్ గ్లోరీ మైదానంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తారని పేర్కొన్నారు. హెచ్‌ఎం సురేంద్రప్రసాద్, పీఈటీ రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రాయికల్‌లో నకిలీ నోటు కలకలం
రాయికల్: పట్టణంలో దొంగ నోట్ల చలామణి జోరుగా సాగుతోంది. గురువారం పట్టణానికి చెందిన చికెన్ సెంటర్ యజమాని వాసం స్వామికి దొంగ నోటు వచ్చింది. ఆ నోటులోంచి వెలుతురుకు చూస్తే గాంధీ బొమ్మ కన్పించకపోవడంతో గమనించిన వాసం స్వామి దొంగ నోటుగా గుర్తించాడు. ఇటీవల కాలంలో పట్టణంలో రూ.500, రూ.100 దొంగనోట్ల చలామణి జోరుగా సాగుతోంది.
నేడు ‘కేశోరాం’లో దీపావళి బోనస్‌పై చర్చలు
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ కేశోరాం సిమెంట్ కర్మాగారం కార్మికుల దీపావళి బోనస్‌పై శుక్రవారం కార్మిక సంఘానికి, యాజమాన్యానికి మధ్య అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో చర్చలు జరగనున్నాయి. గతేడాది కంటే అదనంగా బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ కంపనీ కాంట్రాక్ట్, పర్మినెంట్ కార్మికులు నెల రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25న విధులు బహిష్కరించి, కంపనీ గేట్ ఎదుట నిరసన తెలిపారు. స్పందించిన అసిస్టెంట్ లేబర్ కమిషనర్ యూసుఫ్ పర్మినెంట్ కార్మిక సంఘం నాయకులు, కంపనీ అధికారులను పిలిచి, విషయం తెలుసుకున్నారు. శుక్రవారం చర్చలకు ఆహ్వానించారు. దీంతో కార్మికుల్లో ఉత్కంఠ నెలకొంది. తమ డిమాండ్ మేరకు యాజమాన్యం బోనస్‌ను చెల్లిస్తుందా లేదా అని చర్చించుకుంటున్నారు.
పశుగ్రాసం, ట్రాక్టర్ దగ్ధం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): మండలంలోని గంగారం గ్రామ పంచాయితీ పరిధి ఊశన్నపల్లె గ్రామంలో గురువారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పశుగ్రాసం, ట్రాక్టర్ దగ్ధమైంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన ముస్కు రాయమల్లు ట్రాక్టర్‌లో పశుగ్రాసం తరలిస్తుండగా ఈప్రమాదం జరిగింది. విద్యుత్ తీగలు కిందకు వేలాడి ఉండటం వల్లే షార్ట్ సర్క్యూట్ జరిగినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం ప్రమాదానికి కారణమైందని బాధిత రైతు వాపోయాడు. ఈఘటనలో రూ.20 వేలు విలువ చేసే పశుగ్రాసంతోపాటు ట్రాక్టర్ టైర్లు కాలిబూడిదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment