మళ్లీ అదే నిర్లక్ష్యం..
జగిత్యాల: ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. ప్రజలు నరకయాతన పడుతున్నా.. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. ఇటీవల ఓ వృద్ధుడు చికిత్స పొందుతుండగా.. ఆయనకు తోడుగా ఉన్న భార్య అనారోగ్యం పాలైంది. ఆమెను అక్కున చేర్చుకుని వైద్యం అందించాల్సిన సిబ్బంది మానవత్వం లేకుండా ఆస్పత్రి బయట పడుకోబెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో వెంటనే ఆస్పత్రిలోకి చేర్పించుకుని చికిత్స అందించారు. ఆ ఘటన మరువక ముందే ఆస్పత్రిలో ఒకరి ఆక్సిజన్‌ను మరొకరికి పెట్టి తమ నిర్లక్ష్యాన్ని మరోమారు చాటుకున్నారు సిబ్బంది.
ఒకరి ఆక్సిజన్ మరొకరికి..
జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లికి చెందిన పోచవ్వ అనే వృద్ధురాలు అనారోగ్యంతో ఆస్పత్రికి చేరింది. ఆమెకు శ్వాసకోశ ఇబ్బందులు ఉండటంతో ఆక్సిజన్ పెట్టారు. సారంగాపూర్ మండలం అర్పపల్లికి చెందిన సుమలత అనారోగ్యానికి గురికాగా బంధువులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చారు. ఆమె ఆరోగ్యం క్రిటికల్‌గా ఉండటంతో ఆక్సిజన్ పెట్టాలని వైద్యులు సూచించారు. అయితే ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయో..? లేవో..? గాని దాదాపు 15 నిమిషాల పాటు గడిపారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతున్న పోచవ్వకు చెందిన ఆక్సిజన్‌ను తొలగించి సుమలతకు పెట్టారు. అప్పటికే క్రిటికల్ పరిస్థితికి చేరుకున్న సుమలత చనిపోయింది. అయితే ఆక్సిజన్ సకాలంలో అందకనే చనిపోయినట్లు ఆమె బంధువుల ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పోచవ్వకు పెట్టిన ఆక్సిజన్ సిలిండర్ తొలగించి సుమలతకు పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ పోచవ్వకు ఏమైనా జరిగి ఉంటే ఎలా..? అని ఆమె బంధువులు ప్రశ్నిస్తున్నారు. ఆస్పత్రిలో సిలిండర్ల కొరత లేదని, ప్లాంట్ కూడా ఈ మధ్యే బాగైందని వైద్యాధికారులు ప్రకటించారు. అదే సమయంలో ఇలాంటి సంఘటన జరగడం విమర్శలకు తావిస్తోంది. ఈ విషయమై ఆర్‌ఎంవో నవీన్‌ను వివరణ కోరగా.. శ్రీఏదైనా సీరియస్ పేషెంట్స్ వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న సిలిండర్ పెట్టే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఉన్న రోగికి సిలిండర్ అత్యంత అవసరం లేకపోతే దానిని పరిశీలించి తీయడం మామూలే. వచ్చిన పేషెంట్ చనిపోయే స్థితిలో ఉండటంతోనే సిలిండర్ పెట్టినట్లు తెలిసింది. అందులో నిర్లక్ష్యమేమీ లేదు. ఆక్సిజన్ సిలిండర్లు, ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి..’ అని పేర్కొన్నారు.
ఒకరి ఆక్సిజన్ సిలిండర్ మరొకరికి..
ఆస్పత్రిలో తాజాగా మరో ఘటన
Comments
Please login to add a commentAdd a comment