జగిత్యాల జిల్లాలోనే 35 వేల ఎకరాల్లో..
జగిత్యాల అగ్రికల్చర్: ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులు మామిడి పంటకు ప్రతిబంధకంగా మారాయి. దీంతో, నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో రావాల్సిన మామిడి పూత ఇప్పటికీ చెట్లపై కనిపించడం లేదు. అక్కడక్కడ వచ్చిన పూతను తేనె మంచు పురుగు ఆశించి, తీవ్ర నష్టం చేస్తోంది. రెండు, మూడేళ్లుగా మామిడి పంట దిగుబడి సరిగా రావడం లేదు. ఈ ఏడాదైనా పంట వస్తుందో, రాదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొడి వాతావరణం ఉండాలి..
మామిడి పూత సాధారణంగా నవంబర్ నెల చివరి నుంచి ప్రారంభమై డిసెంబర్, జనవరి వరకు వస్తుంటుంది. పూత ఆలస్యమైనకొద్దీ ఉష్ణోగ్రతలు భారీగా పెరిగి, పూత, పిందెలు రాలిపోతుంటాయి. దీనికితోడు, ఏప్రిల్, మే నెలల్లో వచ్చే వడగాలులకు కాయలు రాలిపోతుంటాయి. అయితే, గత కొన్ని నెలలుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలతోపాటు తేమశాతం పెరగడం, చలి ప్రభావంతో పూ మొగ్గలు బిగుసుకుపోయి, సరిగా విచ్చుకోవడం లేదు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో రాత్రివేళల్లో కురిసే మంచు కూడా పూతపై ప్రభావం చూపుతోంది. పూత నుంచి పిందె వచ్చే వరకు పొడి వాతావరణం ఉండాలి. కానీ, ఆ పరిస్థితులు కనిపించడం లేదు.
ఆశిస్తున్న తేనె మంచు పురుగు..
మూడేళ్లుగా మామిడికి పూత రాకపోవడం, వచ్చినా నిలవకపోవడం, విపరీతంగా తేనెమంచు పురుగు ఆశిస్తుండటంతో మామిడి రైతుకు అనుకున్న దిగుబడి రావడం లేదు. దీంతో, కొంతమంది ఇప్పటికే తోటలను తొలిగించగా, మరికొందరు ఈ ఏడాది పంట దిగుబడిని బట్టి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు. పూతకు ముందుగానే తెగుళ్లు, పురుగులు ఆశించకుండా మామిడి తోటల్లో ఒక్కో రైతు కనీసం ఎకరాకు రూ.20 వేల విలువైన రసాయన ముందులు పిచికారీ చేయిస్తున్నారు. అన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నా పూత రావడం, వచ్చినా నిలవడం కష్టమవుతోంది.
అధిక వర్షాలు పెద్ద దెబ్బ..
మామిడి చెట్లు పూతకు రావాలంటే బెట్ట పరిస్థితులు ఉండాలి. కానీ, గతేడాది సెప్టెంబర్ వరకు అధిక వర్షాలు కురిశాయి. భూమంతా తేమతో ఉంది. ఏటా కాయలు తెంపగానే, వర్షాకాలంలో చెట్లను ప్రూనింగ్(కొమ్మల కటింగ్) చేయిస్తే కొత్తగా వచ్చే కొమ్మలకు, రెమ్మలకు పూత వస్తుంది. పూత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనవరి నెల సగానికి వచ్చినా పూత రాకపోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే, మామిడి పూతల సీజన్ రాగానే.. తోటల వెంట పరుగెత్తే లీజుదారులు ఈసారి వాటివైపే చూడటం లేదు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 80 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఒక్క జగిత్యాల జిల్లాలోనే 35 వేల ఎకరాల్లో విస్తరించాయి. సగటున ఎకరాకు 5 టన్నుల చొప్పున 4 లక్షల మె.ట. మామిడి దిగుబడి వస్తుందని అంచనా. అయితే, మామిడి సీజన్‌లో ధర సైతం టన్నుకు తక్కువలో తక్కువ రూ.30 వేల నుంచి రూ.40 వేలు పలుకుతుంది. సాధారణ పంటలైన వరి, మొక్కజొన్నకు పెట్టుబడులు పెరిగిపోవడం, కూలీలు దొరక్కపోవడంతో భూమి ఉన్న రైతులు మామిడి తోటలు పెంచుతున్నారు. జగిత్యాల, కరీంనగర్‌లలో మార్కెట్లు ఉండటం, ప్రధాన రోడ్ల వెంట మామిడిని ఎక్కడికక్కడే కొనుగోలు చేస్తుండటం కూడా ఇందుకు కారణం. వ్యాపారులు నేరుగా ఢిల్లీ, నాగ్‌పూర్ వంటి నగరాలకు తరలిస్తుండటంతో మామిడికి మంచి రేటు వస్తుందని ఆశపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment