బావిలో పడి వృద్ధుడి మృతి
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలంలోని జాబితాపూర్‌కు చెందిన ఈదుల రామయ్య(70) బావిలో పడి మృతిచెందాడని ఎస్సై సదాకర్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. రామయ్యకు కొంతకాలంగా కళ్లు కనిపించడం లేదు. మంగళవారం ఇంటికి సమీపంలోని తోట వద్దకు వెళ్తూ.. ప్రమాదవశాత్తు కాలు జారి, బావిలో పడ్డాడు. మృతుడి తమ్ముడు లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కొండగట్టు(చొప్పదండి): కొడిమ్యాల మండలం పూడూరు శివారులోని పొలం వద్ద మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సందీప్ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసినవారు తమకు సమాచారం అందించాలని కోరారు.
చికిత్స పొందుతూ యువకుడి మృతి
ముత్తారం(మంథని): ముత్తారం మండలంలోని లక్కారానికి చెందిన కురాకుల సాయికుమార్(22) చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై నరేశ్ వివరాల ప్రకారం.. కురాకుల సమ్మయ్య–కళావతి దంపతుల కుమారుడు సాయికుమార్ డిగ్రీ చదివాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పలు పోటీ పరీక్షలు రాశాడు. ఒక్క ఉద్యోగం కూడా రాలేదన్న మనస్తాపంతో ఈ నెల 16న క్రిమిసంహారక మందు తాగాడు. కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
సుల్తానాబాద్‌రూరల్: తాళం వేసిన ఇంట్లో చొరబడిన దుండగులు టీవీ ఎత్తుకెళ్లారు. ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వంగల శ్రీనివాస్ ఈ నెల 17న ఇంటికి తాళం వేసి, కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లాడు. సోమవారం రాత్రి తిరిగిరాగా, తాళం పగులకొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా ఉన్నాయి. అందులో ఏమీ దొరక్కపోవడంతో రూ.48 వేల విలువైన స్మార్ట్ టీవీని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని శ్రీనివాస్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment