ఎన్‌హెచ్–63కి లైన్‌క్లియర్
● జిల్లాలో 71.13 కిలోమీటర్ల ఇంటర్ కారిడార్ ● 240 రైతుల నుంచి 250 హెక్టార్ల భూసేకరణ ● 30 రెవెన్యూ గ్రామాల్లో నిర్వాసితులు
జగిత్యాలరూరల్: నేషనల్‌హైవే అథారిటి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్మూర్ నుంచి జగ్దల్‌పూర్ వరకు జిల్లా మీదుగా నిర్మించే ఇంటర్ కారిడార్ (ఐసీఆర్) ఎన్‌హెచ్–63 రహదారికి జిల్లాలో రెవెన్యూ అధికారులు భూసేకరణ పూర్తి చేశారు. రైతులకు పరిహారం అందించేందుకు భూములు కోల్పోయిన రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు కూడా స్వీకరించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. జిల్లాలో పూర్తిస్థాయిలో భూసేకరణ పూర్తికావడంతో ఇంటర్ కారిడార్ రహదారి నిర్మాణ పనుల ప్రారంభానికి సన్నద్ధమవుతున్నారు.
జిల్లాలో 30 రెవెన్యూ గ్రామాల్లో భూసేకరణ
జిల్లాలో ఎన్‌హెచ్–63 నాలుగు వరుసల రహదారి కోసం 30 రెవెన్యూ గ్రామాల్లోని 240 మంది రైతులనుంచి 250.0790 హెక్టార్ల భూమి సేకరించారు. మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ నుంచి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వరకు రహదారి నిర్మాణానికి భూసేకరణ పూర్తి చేశారు.
కొనసాగుతున్న అవార్డు విచారణ
రెవెన్యూ అధికారులు జిల్లా వ్యాప్తంగా భూములు కోల్పోతున్న రైతుల వివరాలతోపాటు, భూసేకరణ వివరాలు కూడా ఉన్నతాధికారులకు నివేదించారు. ఫలితంగా అవార్డు విచారణ కొనసాగుతోంది. అవార్డు విచారణ పూర్తి కాగానే దశల వారిగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయనున్నారు.
జిల్లాలో 71.13 కి.మీ రహదారి నిర్మాణం
జిల్లాలో నేషనల్ హైవే 63 నాలుగు వరుసల రహదారి నిర్మాణం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుంచి జగ్దల్‌పూర్ వరకు నిర్మాణం చేపట్టనున్నారు. ఇది జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి నుంచి వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వరకు 71.13 కిలోమీటర్ల మేర ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment