ప్రజాపాలన విజయోత్సవం
వరంగల్ వేదికగా...
సాక్షిప్రతినిధి, వరంగల్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలకు వరంగల్ వేదిక కానుంది. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాది కాలంలో సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు, వివిధ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ‘ప్రజాపాలన – ప్రజా విజయోత్సవ’సభను ఓరుగల్లులో నిర్వహించాలని భావించిన సీఎం రేవంత్‌రెడ్డి... శుక్రవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతోపాటు పలువురు మంత్రులతో జరిపిన సమీక్షలో నిర్ణయించారు. ప్రజాపాలన విజయోత్సవ ఉత్సవాల సందర్భంగా డిసెంబర్ 9 వరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నప్పటికీ తొలిసభకు వరంగల్‌ను వేదిక చేసుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు వరంగల్ వేదిక నుంచి 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల వరంగల్ పర్యటన నేపథ్యంలో హెలిపాడ్, సభావేదికల ఏర్పాటు తదితర కార్యక్రమాలకు సంబంధించి రూట్ మ్యాప్ తయారీలో అధికార యంత్రాంగం బిజీ అయ్యింది.
హైదరాబాద్‌లో కలెక్టర్లతో సీఎస్ సమీక్ష..
ముఖ్యమంత్రి రేవంత్ వరంగల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు శుక్రవారం పరిశీలించారు. సీఎం రాక మొదలుకుని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన, పనుల సమీక్ష, తిరిగి హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ బయలుదేరే వరకూ షెడ్యూల్ ప్రకారం పర్యటన సాగేలా ఏర్పాట్లను గురించి వారు చర్చించారు. హెలిపాడ్‌తోపాటు సభను నిర్వహించే ఆర్ట్స్ కళాశాల మైదానం, బాలసముద్రంలోని కాళోజీ కళా క్షేత్రం, కాజీపేట ఆర్వోబీని పరిశీలించారు. ఇదిలా ఉండగా హైదరాబాద్‌లో కలెక్టర్‌లు, కమిషనర్లతో సీఎస్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో హుటాహుటిన శుక్రవారం సాయంత్రం రెండు జిల్లాల కలెక్టర్‌లు డా.సత్యశారద, ప్రావీణ్య, పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఇతర ఉన్నతాధికారులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. సచివాలయం ఆవరణలో రాత్రి వరకు రాష్ట్ర అటవీ, పర్యాటకశాఖ మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి తదితరులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన, రూట్ మ్యాప్, సభావేదిక ఏర్పాటు తదితర అంశాలపైన సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు తెలిసింది.
19న ఓరుగల్లుకు సీఎం రేవంత్..
హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో భారీ సభ
ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రుల హాజరు
22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలకు ఇక్కడినుంచే శ్రీకారం
నగరంలో అభివృద్ధి పనులకు
శంకుస్థాపన, ప్రారంభోత్సవం
సీఎం సభ కోసం విస్తృతంగా ఏర్పాట్లు..
కలెక్టర్‌లు, కమిషనర్లతో
సీఎస్ అత్యవసర భేటీ...
ఏర్పాట్లపై నేడు వరంగల్‌కు
టీపీసీసీ చీఫ్, మంత్రులు...
నేడు హనుమకొండకు పీసీసీ చీఫ్,
మంత్రులు...
ప్రజాపాలన విజయోత్సవ సభ, ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి శనివారం హనుమకొండకు వస్తున్నట్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని, రెండు రోజులుగా కలెక్టర్‌లు, పోలీసు, మున్సిపల్ కమిషనర్‌లు, ఇతర ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కాగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌తో పాటు మంత్రులు హెలిపాడ్, సభావేదిక, కాళోజీ కళాక్షేత్రం, కాజీపేట ఆర్వోబీ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. విజయోత్సవ సభ, సీఎం పర్యటన సక్సెస్ కోసం జనసమీకరణపై చర్చించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment