రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని శివునిపల్లి జెడ్పీఎస్‌ఎస్‌కు చెందిన విద్యార్థులు దేవర చరణ్, గుగులోతు మధుసూదన్, బానోతు మని రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బేస్‌బాల్ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం కుసుమ రమేష్, పీడీ కొండ రవి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం పాఠశాలలో ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నిర్మల్‌లో జరిగే రాష్ట్రస్థాయి బేస్‌బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న వారిని హెచ్‌ఎం, పీడీతో పాటు పాఠశాల అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి, జొన్నల రాజేశ్వరరావు, ఎండీ.దస్తగిరి, ఉపాధ్యాయులు అభినందించారు.
‘భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోం’
జనగామ: ఫార్మా కంపెనీల పేరిట లంబాడీల భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తే ఊరుకోమని లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజ్మీర స్వామి నాయక్ అన్నారు. జనగామ లంబాడీల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జనగామ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా అజ్మీర స్వామి నాయక్ మాట్లాడుతూ కొడంగల్‌లోని లగచర్ల గ్రామంలో లంబాడీల భూములను ఫార్మా కంపనీ బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నిస్తున్న క్ర మం లో అక్కడి గిరిజనులు కలెక్టర్ సమావేశంలో తిరగబడ్డారన్నారు. అలాంటి గిరిజనులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపడం బాధాకరమన్నారు. తక్షణమే వారిని విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత, వాంకుడోతు కాలురాం నాయక్, కొర్ర రాజేందర్, కొమురెల్లి, రాజు, భూక్య చందునా యక్, రఘు, శంకర్, దేవి, ధర్మబిక్షం పాల్గొన్నారు.
ప్రజా సమస్యలను
పట్టించుకోని ప్రభుత్వాలు
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రజా సమస్యలను కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేవని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.అబ్బాస్ అన్నారు. డిసెంబర్ 27, 28వ తేదీల్లో ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో నిర్వహించనున్న జిల్లా మహాసభలకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని శుక్రవారం ఘన్‌పూర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చేపట్టనున్న ప్రజా ఉద్యమాల రూపకల్పనకు జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి, నాయకులు సాంబరాజు, యాదగిరి, అహల్య, సోమయ్య, రాపర్తి రాజు, రమేష్, యాకయ్య, గోపి, చందునాయక్, విజేందర్, తదితరులు పాల్గొన్నారు.
డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు
వరంగల్ లీగల్: వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జస్టిస్ యం.సాయి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి.నిర్మల గీతాంబ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. స్టెనోగ్రాఫర్ (1), టైపిస్ట్ (1), రికార్డ్ అసిస్టెంట్ (2) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్ని ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రిజిస్టర్ పోస్ట్ ద్వారా డిస్టిక్ర్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ–వరంగల్, డిస్ట్రిక్ట్ కోర్టు కాంప్లెక్స్‌కు పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు వరంగల్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. నియామక ప్రక్రియకు సంబంధించి అన్ని అంశాలను వరంగల్ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.
‘రైతు భరోసా’ను
విడుదల చేయాలి
తొర్రూరు: రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేసి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలని సీపీఐ మానుకోట జిల్లా కార్యదర్శి విజయ్‌సారథి కోరారు. శుక్రవారం డివిజన్ కేంద్రంలోని లయన్స్‌క్లబ్ భవనంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment